
అగ్రరాజ్యానికి ఎగుమతులు పెంచుకోవచ్చు
అమెరికా–చైనా వాణిజ్య యుద్ధంపై నిపుణులు
న్యూఢిల్లీ: అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధంతో భారతీయ ఎగుమతిదార్లు లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనితో అగ్రరాజ్యానికి ఎగుమతులను మరింతగా పెంచుకోవడానికి చాన్స్ లభించవచ్చని పేర్కొన్నారు. 2024–25లో అమెరికాకు భారత్ సుమారు 86 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేసింది. చైనాపై భారీ టారిఫ్‌ల వల్ల అమెరికన్ కొనుగోలుదారులు భారత్‌వైపు మొగ్గు చూపవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌సీ రాల్హన్ అభిప్రాయపడ్డారు.
ఆ విధంగా ఈ వాణిజ్య యుద్ధం ద్వారా మనం లబ్ధి పొందే అవకాశం ఉంటుందన్నారు. నవంబర్ 1 నుంచి చైనా ఉత్పత్తులపై అదనంగా 100 శాతం టారిఫ్‌లు విధించనున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనితో చైనా దిగుమతులపై మొత్తం సుంకాలు 130 శాతానికి చేరతాయి. అమెరికా డిఫెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు మొదలైన వాటికి కీలమైన రేర్ ఎర్త్ ఎగుమతులపై అక్టోబర్ 9న చైనా తాజాగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ విధంగా స్పందించింది. ప్రస్తుతం చైనాపై అమెరికా 30 శాతం సుంకాలు విధిస్తుండగా, భారత్‌పై అంతకన్నా ఎక్కువగా 50 శాతం వేస్తోంది.
దీనితో మన ఉత్పత్తుల కన్నా చైనా ఉత్పత్తులే చౌకగా లభించే పరిస్థితి నెలకొంది. అయితే, చైనాపై 100 శాతం అదనపు సుంకాలు విధించడం వల్ల అమెరికన్ మార్కెట్లో చైనా ఉత్పత్తుల ధరలు, మిగతా దేశాలతో పోటీపడలేనంతగా పెరిగిపోతాయని ఓ ఎగుమతిదారు తెలిపారు. దీంతో సుంకాలు తక్కువగా ఉన్న దేశాల వైపు అమెరికన్ కొనుగోలుదారులు మొగ్గు చూపుతారని బొమ్మల ఎగుమతిదారు మను గుప్తా తెలిపారు. ఇప్పటికే టార్గెట్‌లాంటి రిటైల్ దిగ్గజాలు కొత్త ఉత్పత్తుల కోసం తమను సంప్రదించినట్లు వివరించారు.
ఈవీల రేట్లకు రెక్కలు..
అమెరికా–చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ), విండ్ టర్బైన్‌లు, సెమీకండక్టర్ల విడిభాగాల రేట్లకు రెక్కలొచి్చనట్లు మేథావుల సంఘం జీటీఆర్‌ఐ తెలిపింది. ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, పాదరక్షలు, వైట్ గూడ్స్, సోలార్ ప్యానెళ్ల కోసం అమెరికా ఎక్కువగా చైనాపైనే ఆధారపడుతోందని పేర్కొంది. వరుసగా నాలుగో ఏడాది 2024–25లో కూడా భారత్‌కి అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలి్చంది. ఇరు దేశాల మధ్య 131.84 బిలియన్ డాలర్ల (86.5 బిలియన్ డాలర్ల ఎగుమతులు) ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. భారత్ ఎగుమతుల్లో అమెరికా వాటా 18 శాతంగా, దిగుమతుల్లో 6.22 శాతంగా ఉంటోంది. ఇరు దేశాలు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తున్నాయి.