
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈరోజు పెట్రోల్ ధరలు పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో లీటరు పెట్రోల్ రూ.109.46గా నమోదైంది. ఇది దేశంలోనే అత్యధిక ధర కావడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం క్రూడాయిల్ కొనుగోళ్లు ఒకే విధంగా ఉన్నప్పటికీ రాష్ట్రాల వారీగా వీటి ధరల్లో ఇంత వ్యత్యాసం ఉండటంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ అధిక ధరలకు ప్రధాన కారణాలుగా ఉన్న పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల స్వరూపాన్ని కింద చూద్దాం.
రాష్ట్రాల వారీగా ధరల్లో వ్యత్యాసానికి కారణాలు
ముడి చమురు (Crude Oil) కొనుగోలు ధర అంతర్జాతీయ మార్కెట్‌పై, డాలర్‌తో రూపాయి మారకం విలువపై ఆధారపడి ఉన్నప్పటికీ తుది వినియోగదారునికి చేరే పెట్రోల్ ధర రాష్ట్రాల వారీగా గణనీయంగా మారుతోంది. పెట్రోల్, డీజిల్‌ను వస్తు, సేవల పన్ను (GST) పరిధి నుంచి మినహాయించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఇంధనంపై విలువ ఆధారిత పన్ను (VAT)ను విధిస్తున్నాయి. ఈ వ్యాట్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధిక వ్యాట్ విధించడం వల్ల ఇక్కడ పెట్రోల్ ధర దేశంలోనే అత్యధికంగా ఉంది. తెలంగాణ, కేరళ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా వ్యాట్ అధికంగా ఉండటం వల్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినా..
కేంద్ర ప్రభుత్వం గతంలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి కొన్ని రాష్ట్రాలు తమ రాష్ట్ర వ్యాట్‌ను తగ్గించలేదు. దీని ఫలితంగా కేంద్రం ఇచ్చిన తగ్గింపు ప్రయోజనం వాహనదారులకు పూర్తి స్థాయిలో అందడంలేదు. చమురు రిఫైనరీల నుంచి పెట్రోల్, డీజిల్ రవాణా చేసే దూరాన్ని బట్టి ఖర్చులు కూడా ధరను ప్రభావితం చేస్తాయి. అయినప్పటికీ ప్రధాన వ్యత్యాసానికి కారణం రాష్ట్రాల పన్ను విధానాలేనని గుర్తుంచుకోవాలి. డీలర్ల కమిషన్ కూడా తుది ధరలో భాగమే. ఇది రిఫైనరీల నుంచి డీలర్లకు ఇంధనాన్ని సరఫరా చేసినందుకు గాను చమురు కంపెనీలు చెల్లిస్తాయి.
పన్నుల స్వరూపం
పెట్రోల్ తుది ధరలో దాదాపు 50% నుంచి 60% వరకు పన్నుల రూపంలోనే ఉంటుంది. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు ఉంటాయి.
కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు
కేంద్ర ప్రభుత్వం లీటరు పెట్రోల్‌పై ఒక నిర్ణీత మొత్తం (Fixed Amount)లో ఎక్సైజ్ సుంకాన్ని విధిస్తుంది. ఈ మొత్తాన్ని కేంద్రం తన ఖజానాకు జమ చేసుకుంటుంది. సెస్ (Cess), స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (SAED)పేరుతో కూడా కేంద్రం పన్నులను విధిస్తుంది. వీటిలో చాలా వరకు రాష్ట్రాలతో పంచుకోకుండా కేంద్రమే తీసుకుంటోంది.
రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు
రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్‌పై విలువ ఆధారిత పన్ను (VAT)ను విధిస్తున్నాయి. ముఖ్యంగా ఇది డీలర్లకు అమ్మే ధర, కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం, డీలర్ కమిషన్‌తో సహా మొత్తం ధరపై విధిస్తారు. దీని కారణంగా ఇంధనం బేస్ ధర పెరిగితే, రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కూడా పెరుగుతుంది.
🚨 Petrol prices per litre as of today. (High to Low)
Andhra Pradesh – ₹109.46
Kerala – ₹107.49
Telangana – ₹107.46
Madhya Pradesh – ₹106.52
Bihar – ₹105.60
West Bengal – ₹105.41
Rajasthan – ₹104.72
Maharashtra – ₹103.50
Sikkim – ₹103.30
Karnataka – ₹102.92
Ladakh –…— Indian Tech & Infra (@IndianTechGuide) October 13, 2025
ఈ రోజు లీటరు పెట్రోల్ ధరలు (వివిధ రాష్ట్రాల్లో)..
ఆంధ్రప్రదేశ్ రూ.109.46
కేరళ రూ.107.49
తెలంగాణ రూ.107.46
మధ్యప్రదేశ్ రూ.106.52
బీహార్ రూ.105.60
పశ్చిమ బెంగాల్ రూ.105.41
రాజస్థాన్ రూ.104.72
మహారాష్ట్ర రూ.103.50
కర్ణాటక రూ.102.92
ఢిల్లీ రూ.94.77
అండమాన్ నికోబార్ దీవులు రూ.82.46
ఇదీ చదవండి: 3వ తరగతి నుంచే ఏఐ పాఠాలు! ప్రభుత్వం నిర్ణయం..