ఆర్థిక వ్యవస్థ పతనాన్ని అడ్డుకున్నాం

RBI Governor Shaktikanta Das on missing inflation target - Sakshi

రేట్లను ముందే కట్టడి చేస్తే మరోలా ఉండేది

ఆ పరిస్థితిని ఆర్‌బీఐ నివారించింది

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌

ముంబై: ద్రవ్యోల్బణాన్ని లకి‡్ష్యత స్థాయికి కట్టడి చేయడంలో విఫలమైందంటూ వస్తున్న విమర్శలకు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ తగిన బదులిచ్చారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమన్న ప్రాథమిక లక్ష్యంలో వెనుకబడినట్టు అంగీకరిస్తూనే.. ఆర్‌బీఐ అనుసరించిన విధానాన్ని ఆయన సమర్థించుకున్నారు. ముంబైలో జరిగిన ఎఫ్‌ఐబీఏసీ సమావేశంలో భాగంగా శక్తికాంతదాస్‌ తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఒకవేళ ఆర్‌బీఐ ముందుగానే రేట్లను కట్టడి చేసి ఉంటే ఆర్థిక వ్యవస్థ అధోముఖం పాలయ్యేదన్నారు. భారత ఆర్థిక వ్యవస్థను బలమైన, సుస్థిర, ఆశావాదంగా ప్రపంచం చూస్తున్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం ఇప్పుడిక మోస్తరు స్థాయికి దిగొస్తుందన్నారు. ద్రవ్యోల్బణం విషయంలో విరుద్ధమైన అంశాలను కూడా చూడాల్సి ఉంటుందని, ముందస్తుగానే రేట్లను కట్టడి చేయడం వృద్ధికి విఘాతాన్ని కలిగిస్తుందన్న వాస్తవాన్ని గుర్తించాలని దాస్‌ సూచించారు.

‘‘అలా చేస్తే ఆర్థిక వ్యవస్థ, దేశ పౌరులకు భారంగా మారి ఉండేది. భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చేది’’అని దాస్‌ అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థను సురక్షిత స్థానానికి చేర్చాల్సి ఉందంటూ, అటువంటి తరుణంలో కోలుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు అవరోధం కలిగించరాదన్నారు. ‘‘కరోనా సమయంలో ద్రవ్యోల్బణం నిర్ధేశిత లక్ష్యం 2–6 శాతం పరిధిలో కొంచెం పెరిగినా పర్వాలేదనే విధంగా ఆర్‌బీఐ సులభతర మానిటరీ పాలసీ చర్యలను అనుసరించింది. ఆర్థిక వృద్ధికి మద్దతుగా ఇలా చేసింది. దీంతో 2021–22, 2022–23లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంది’’అని వివరించారు. భారత ఆర్థిక వృద్ధి రికవరీ విస్తత స్థాయిలో ఉందంటూ.. సకాలంలో, సరైన లక్షి్యత ద్రవ్య, మానిటరీ, నియంత్రణపరమైన విధానాల ఫలితమే ఇదన్నారు.

ప్రభుత్వానికి నివేదిక
ఆర్‌బీఐ ఎంపీసీ గురువారం (ఈ నెల 3న) నాటి సమావేశం ఎజెండాను శక్తికాంతదాస్‌ వెల్లడించారు. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంలో ఎందుకు విఫలమైందనే, కారణాలపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. వరుసగా తొమ్మిది నెలల పాటు ద్రవ్యోల్బణం 6 శాతానికి పైనే కొనసాగడానికి దారితీసిన కారణాలను వివరించనున్నట్టు తెలిపారు. వ్యవసాయ రంగ రుణాల ప్రయోగాత్మక డిజిటైజేషన్‌పై దాస్‌ స్పందిస్తూ.. చిన్న వ్యాపార రుణాలకు సైతం 2023 నుంచి ఇదే విధానాన్ని అనుసరించాలని అనుకుంటున్నట్టు చెప్పారు.

‘అర్జునుడు–చేప కన్ను’ ప్రస్తావన...
ఇప్పుడు ద్రవ్యోల్బణం కట్టడిపైనే దృష్టినంతా కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ భావిస్తోందని శక్తికాంతదాస్‌ స్పష్టం చేశారు. మహాభారత ఇతిహాసంలో పైన తిరిగే చేప కంటిని గురి చూసి కొట్టడంపై అర్జునుడు దృష్టి సారించిన దృష్టాంతాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేయడం గమనార్హం. ‘‘అర్జునుడి పరాక్రమానికి ఎవరూ సాటిలేరు. అలాగే ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే మా నిరంతర ప్రయత్నం’’ అని ఆర్‌బీఐ గవర్నర్‌ వ్యాఖ్యానించారు.   

ఈ–రూపాయిపై పరీక్షలు మొదలు
టోకు (హోల్‌సేల్‌) మాదిరే రిటైల్‌ విభాగంలో ఈ–రూపాయిపై ప్రయోగాత్మక పరీక్షలు ఈ నెల చివరిలోపు మొదలవుతాయని శక్తికాంతదాస్‌ ప్రకటించారు. కొన్ని బ్యాంకుల ద్వారా హోల్‌సేల్‌ విభాగంలో ఈ–రూపాయి వినియోగంపై పరీక్షలు మంగళవారమే మొదలు కావడం గమనార్హం. సెంట్రల్‌ బ్యాంకు డిజిటల్‌ కరెన్సీ (సీబీడీసీ/ఈ–రూపాయి)ని విడుదల చేయడం దేశ కరెన్సీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోతుందని దాస్‌ పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణ విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందన్నారు. రూపాయి విలువ క్షీణతను భావోద్వేగాల కోణం నుంచి బయటకి వచ్చి చూడాలన్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మొదలైనప్పటి నుంచి రూపాయి క్రమపద్ధతిలోనే చలించిందని చెప్పారు. తద్వారా దీనిపైపై విమర్శలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇతర పెద్ద కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ క్షీణత తక్కువగా ఉన్నట్టు చెప్పారు. యూఎస్‌ డాలర్‌ మినహా మిగిలిన కరెన్సీలతో బలపడినట్టు గుర్తు చేశారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top