
జాతీయ పింఛను వ్యవస్థ (ఎన్‌పీఎస్), అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) పథకాల కింద నిర్వహణ ఆస్తులు రూ.16 లక్షల మార్క్‌ను అధిగమించాయి. ఈ రెండూ పింఛను పథకాలే. ఎన్‌పీఎస్ ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు సహా అందరికీ అందుబాటులో ఉంది. ఏపీవై అన్నది ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చిన పథకం. ఎన్‌పీఎస్ 2004లో ప్రారంభం కాగా, ఏపీవై 2015 నుంచి మొదలైంది. ఈ రెండింటి కింద చందాదారుల సంఖ్య 9 కోట్లు దాటినట్టు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ప్రకటించింది.
గిగ్ వర్కర్లకు (తాత్కాలిక కార్మికులు/ డెలివరీ సిబ్బంది తదితర) సైతం పింఛను ప్రయోజనాలు అందించే ఎన్‌పీఎస్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ నమూనాను కూడా పీఎఫ్‌ఆర్‌డీఏ ప్రవేశపెట్టింది. రిటైర్మెంట్ తర్వాత ఎన్‌పీఎస్ నిధి నుంచి క్రమంగా చెల్లింపులు, సౌకర్యవంతమైన యాన్యుటీ ప్రయోజనాలపై ఒక సంప్రదింపుల పత్రాన్ని విడుదల చేసింది. రైతులు, ఎంఎస్‌ఎంఈలు, స్వయం సహాయక బృందాల సభ్యులకూ పెన్షన్ ప్రయోజనాలు విస్తృతం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొంది.
ఇదీ చదవండి: మధ్యతరగతి వారికి వారెన్ బఫెట్ ఆర్థిక సలహా