రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా? | Why Turning Off Wi Fi at Night Could Improve Your Sleep | Sakshi
Sakshi News home page

రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేస్తున్నారా?

Feb 25 2026 12:59 PM | Updated on Feb 25 2026 12:59 PM

Why Turning Off Wi Fi at Night Could Improve Your Sleep

నేటి డిజిటల్ యుగంలో ఓ పూట ఫుడ్‌ లేకపోయినా ఉండగలరేమో కానీ, ఇంటర్నెట్ లేనిదే నిమిషం గడవని పరిస్థితి. ఇళ్లలో వై-ఫై రౌటర్లు ఇప్పుడు నిత్యావసర వస్తువులైపోయాయి. అయితే రాత్రి నిద్రపోయే సమయంలో కూడా మీ రౌటర్ ఆన్ చేసే ఉంటుందా? అలా అయితే అది మీ ఆరోగ్యంపై, ముఖ్యంగా మీ నిద్రపై ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే లాభనష్టాలపై విశ్లేషణ మీకోసం..

నిద్రలేమికి రౌటర్ కారణమా?

చాలామంది ఉదయాన్నే నిద్రలేవగానే నీరసంగా, అలసటగా ఉన్నట్లు ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి గదిలో ఉండే వై-ఫై రౌటర్‌ నుంచి విడుదలయ్యే విద్యుదయస్కాంత తరంగాలు ఒక కారణం కావచ్చని కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి.

ఆర్‌ఎంఐటీ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) రిపోర్ట్‌: 2024లో వెలువడిన ఒక అధ్యయనం ప్రకారం వై-ఫై రౌటర్ సమీపంలో నిద్రించే వారిలో 27 శాతం మంది నిద్రలేమి సమస్యలతో బాధపడుతున్నారు. 2.4 గిగా హెడ్జ్‌ ఫ్రీక్వెన్సీ గల వై-ఫై సిగ్నల్స్ మానవుల గాఢ నిద్రను తగ్గిస్తాయని ఒక పరిశోధనలో తేలింది. అయితే, దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ నాన్-అయోనైజింగ్ రేడియేషన్ ప్రొటెక్షన్ వంటి సంస్థలు.. వై-ఫై రేడియేషన్ చాలా స్వల్పమని, ఇది మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపదని అంటున్నాయి.

రాత్రిపూట వై-ఫై ఆఫ్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

  • రేడియేషన్ ప్రభావం పక్కన పెడితే రౌటర్ ఆఫ్ చేయడం వల్ల డిజిటల్ ప్రపంచం నుంచి మన మెదడుకు విరామం దొరుకుతుంది. ఇది మానసిక ప్రశాంతతో గాఢ నిద్రకు ఉపకరిస్తుంది.

  • రౌటర్ నిరంతరం ఆన్ చేసి ఉంచడం వల్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. రాత్రిపూట ఆఫ్ చేయడం ద్వారా ఏడాదికి కొంత మేర విద్యుత్ ఆదా చేయవచ్చు.

  • రాత్రిపూట ఇంటర్నెట్ వాడనప్పుడు వై-ఫై ఆఫ్ చేయడం వల్ల హ్యాకింగ్ ముప్పు తగ్గుతుంది. అలాగే అనవసరమైన బ్యాక్‌గ్రౌండ్ అప్‌డేట్స్ ఆగిపోయి డేటా మిగులుతుంది.

  • నిరంతరం ఆన్‌లో ఉంటే వేడి వల్ల ఎలక్ట్రానిక్ పరికరాల సామర్థ్యం తగ్గుతుంది. రాత్రి పూట పవర్‌ ఆఫ్‌ చేయడం వల్ల రౌటర్ జీవితకాలం పెరుగుతుంది.

ఎప్పుడు ఆఫ్ చేయకూడదు?

మీరు స్మార్ట్ హోమ్ టెక్నాలజీని వాడుతుంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని పరిస్థితుల్లో వై-ఫై ఆఫ్ చేయకపోవడమే మంచిది. అందులో..

  • మీ ఇంట్లో సీసీ కెమెరాలు వై-ఫై ద్వారా పని చేస్తున్నప్పుడు.

  • స్మార్ట్ డోర్ లాక్స్, వాయిస్ అసిస్టెంట్లు వాడుతున్నప్పుడు.

  • సెక్యూరిటీ అలారమ్స్ యాక్టివ్‌గా ఉండాల్సినప్పుడు.

ఒకవేళ మీరు వై-ఫై ఆఫ్ చేయలేని పరిస్థితులుంటే రౌటర్‌ను మీ బెడ్‌రూమ్‌లో కాకుండా హాలులో లేదా బెడ్‌కు కనీసం 10-15 అడుగుల దూరంలో అమర్చుకోవడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

ఇదీ చదవండి: వినియోగంలో లేని పీఎఫ్‌ ఖాతాల్లో డిపాజిట్ల రిఫండ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement