breaking news
Sleep cycle app
-
పగటి నిద్ర.. మరణ శాసనమే..!
‘నిద్ర తగ్గితే ఏమవుతుందిలే.. తరువాత పడుకోవచ్చు’ అని ఎవరైనా సరిపెట్టుకుంటుంటే, వారు వారి మరణ శాసనాన్ని స్వయంగా రాసుకుంటున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిద్ర అనేది కేవలం విశ్రాంతి మాత్రమే కాదు.. అది శరీర అంతర్గత వ్యవస్థలు చేసే 'రిపేర్ వర్క్'. నిద్రకు దూరమైన సమయంలో మెదడులోని ‘మాస్టర్ క్లాక్’ దిశానిర్దేశం కోల్పోయి, పిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఫలితంగా లోపల నిశ్శబ్ద యుద్ధం మొదలవుతుంది.నిద్రలేమి పరిస్థితిలో మనకు తెలియకుండానే మెలటోనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. రక్త ప్రసరణలో అసమతుల్యత ఏర్పడుతుంది. చివరికి ఊపిరితిత్తులు గాలిని పీల్చుకునేందుకు ఇబ్బంది పడతాయి. రాత్రి నిద్రను ఎగ్గొట్టి, పగలు పడుకుంటే సరిపోతుందిలే అనుకోవడం ఒక పెద్ద భ్రమ. కిటికీ తెరల నుంచి వచ్చే సన్నని వెలుతురు కూడా సరిగా నిద్ర పోనివ్వదు. ఫలితం.. పగలు ఎన్ని గంటలు పడుకున్నా తీరని అలసట, జ్ఞాపకశక్తి మందగించడం, బరువు పెరగడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. ‘మాస్టర్ క్లాక్’ గందరగోళంమన మెదడులో ఉండే 'మాస్టర్ క్లాక్' ప్రకృతి వెలుతురును అనుసరించి పనిచేస్తుంది. రాత్రంతా మేల్కొని, పగలు పడుకుంటే ఈ క్లాక్ పూర్తిగా దెబ్బతింటుంది. కిటికీ రెక్కల నుంచి వచ్చే కొద్దిపాటి వెలుతురు కూడా మెలటోనిన్ ఉత్పత్తిని ఆపేస్తుంది. దీనివల్ల మీరు 10 గంటలు పడుకున్నా శరీరం మాత్రం విశ్రాంతి లేక అల్లాడిపోతూనే ఉంటుంది.మెదడు మొద్దుబారుతుందినిద్రలేమి వల్ల మొదట దెబ్బతినేది ఆలోచనా శక్తి, ఏకాగ్రత లోపించడం. చిన్న విషయాలకే విపరీతమైన చికాకు కలగడం, జ్ఞాపకశక్తి మందగించడం వంటివి దీని ప్రధాన సంకేతాలు. క్రమంగా ఇది డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక సమస్యల సుడిగుండంలోకి నెట్టేస్తుంది. తరచుగా వచ్చే తలనొప్పిని కేవలం పని ఒత్తిడి అనుకుంటే పొరపాటే.. అది మీ నరాల వ్యవస్థ ఇస్తున్న హెచ్చరిక అని గుర్తుంచుకోవాలి.ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావంచాలామంది నిద్రలేమి సమమస్యను చిన్నదిగా తీసుకుంటారు. నోయిడా కైలాష్ హాస్పిటల్ నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం.. నిద్రలేమి అనేది శ్వాసకోస వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. శరీరంలోని 'సిర్కాడియన్ రిథమ్' దెబ్బతినడం వల్ల ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గిపోతుంది.రోగనిరోధక శక్తిపై..నిద్ర లేకపోతే శరీరంలోని రోగనిరోధక కణాలు పగటిపూట నిష్క్రియంగా మారిపోతాయి. ఫలితంగా సామాన్యమైన అంటువ్యాధులు కూడా శరీరంపై తీవ్రంగా దాడి చేస్తాయి. చర్మం, కళ్లు పొడిబారడం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే, శరీర అంతర్గత వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని గుర్తించాలి.అకస్మాత్తుగా బరువు పెరగడంనిద్రలేమి వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. జీవక్రియ మందగించడం వల్ల.. తక్కువ తిన్నప్పటికీ శరీర బరువు అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇది అధిక రక్తపోటు (BP), గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.కోలుకోలేని నష్టం జరగకముందే..ఆటో ఇమ్యూన్ వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకముందే అస్తవ్యస్తమైన నిద్ర అలవాట్లను మార్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. రాత్రిపూట మేల్కొని ఉండటాన్ని 'స్టైల్' గానో లేదా 'అలవాటు' గానో భావిస్తే, అది ఆరోగాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. అందుకే ప్రకృతితో కలిసి నడవడమే ఆరోగ్యానికి ఏకైక మార్గమని వైద్యులు సూచిస్తున్నారు. ఇది కూడా చదవండి: రంగులే కాదు.. పండ్లు, బురదతోనూ రచ్చ -
ఏ దేశం ఎప్పుడు నిద్రలేస్తుంది ?
వాషింగ్టన్: ప్రపంచం ఎప్పుడు నిద్ర పోతుంది, ఎప్పుడు నిద్రలేస్తుంది? ప్రపంచంలోని ఏ దేశం ముందుగా నిద్ర పోతుంది, ఏ దేశం ముందుగా నిద్రలేస్తుంది ? ఏ రోజున ఏ దేశం బద్దకంగా ఒళ్లు విరుచుకుంటుంది, ఏ దేశం ఏ రోజున ఉత్సాహంగా ఉరకలేస్తుంది? మొత్తంగా ఏ దేశం ప్రశాంతంగా పడుకుంటుంది, ఏ దేశం నిద్ర కరవై కలతపడుతుంది? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా!... తమ వద్ద సమాధానాలు సిద్ధంగా ఉన్నాయని ‘స్లీప్ సైకిల్.కామ్’ నిపుణులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా స్లీప్సైకిల్ యాప్ను ఉపయోగిస్తున్న ప్రజల్లో 58 దేశాల్లోని, 9,41,300 మంది యూజర్స్ డేటాను యాక్సిలోమీటర్ ద్వారా ట్రాక్చేసి వాటిని విశ్లేషించి నిపుణలు ఈ ప్రశ్నలకు సమాధానం రాబట్టారు. ప్రపంచంలో ముందుగా నిద్రలేచే దేశం దక్షిణాఫ్రికా. ఆ దేశం సోమవారంనాడు ఉదయం 6.09 గంటలకు నిద్ర లేస్తుంది (సగటు లెక్కల ప్రకారం) మంగళవారం ప్రపంచం బద్ధకంగా నిద్ర లేస్తుంది. ఆ రోజున అమెరికా ప్రజలు సగటున ఉదయం ఏడు గంటలకు నిద్ర లేస్తారు. అన్ని రోజులకల్లా వారు ఆ రోజే పరమబద్ధకంగా ఉంటారట. కారణం ఆరోజు రాత్రి వారికి సరైన నిద్రలేకపోవడమే. మంగళవారం సరిగ్గా నిద్రపోని దేశాల్లో అమెరికా సరసన వరసగా సింగపూర్, స్పెయిన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, బ్రెజిల్ దేశాలు నిలుస్తున్నాయి. అమెరికా సహా ప్రపంచ దేశాలన్ని బుధవారం రాత్రి ప్రశాంతంగా నిద్ర పోతున్నాయి. ఆ రోజున ప్రపంచదేశాలకన్నా చైనా ప్రజలు ఎక్కువ సేపు నిద్రపోతున్నారు. వారం రోజుల్లో సగటున ప్రశాంతంగా నిద్రపోతున్న దేశాల్లో స్లొవేకియా అగ్రస్థానంలో, చైనా రెండో స్థానంలో, భారత్ 25వ స్థానంలో, అమెరికా 48వ స్థానంలో ఉంది. స్లొవేకియా సగటున 6.57 గంటలు నిద్రపోతుండగా, చైనా 6.43 గంటలు, భారత్ 6.35 గంటలు, అమెరికా 7.06 గంటలు నిద్రపోతోంది. (ఇక్కడ ప్రశాంతంగా నిద్ర పోవడమంటే రాత్రిళ్లు మధ్య మధ్యలో ఎక్కువ సార్లు లేవకపోవడం) గురువారం నాడు మధ్యప్రాచ్య దేశాలు ప్రశాంతంగా నిద్ర లేస్తూ ఆ రోజున హాయిగా గడుపుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, కువైట్, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ ఉల్లాసంగా గడుపుతున్నాయి. శుక్రవారం నాడు కోస్టరికా, కెనడా, న్యూజిలాండ్, స్వీడన్ దేశాలు ప్రశాంతంగా గడుపుతున్నాయి. మిగతా రోజుల్లో పోలిస్తే శనివారం నాడు 90 శాతం దేశాలు ఎక్కువ సేపు నిద్రపోతున్నాయి. 71 శాతం దేశాలు ఆ రోజున ఉల్లాసంగా ఉంటున్నాయట. ఇక ఆదివారం నాడు 66 దేశాలు చాలా తక్కువ సమయం ఆదివారం రాత్రి నిద్రపోతున్నాయి. సోమవారం నాడు ప్రపంచంలో ముందుగా నిద్రలేచే దక్షిణాఫ్రికా ఆదివారం రాత్రి సగటున 5.53 గంటలు మాత్రమే నిద్రపోతోంది.


