నాకు నోబెల్ బహుమతి ఇవ్వలేదు. ఇక శాంతి గురించి ఆలోచించను. అమెరికా ప్రయోజనాల కోసం గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకుని తీరతా అంటూ డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ట్రంప్ చేసిన ఆరోపణలపై నార్వే ప్రభుత్వం స్పందించింది.
ట్రంప్ వ్యాఖ్యలపై నార్వే ప్రధాని జోనాస్ గహర్ స్టోర్ స్పందించారు. నోబెల్ శాంతి బహుమతికి, నార్వే ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం ఉండదన్నారు. "నోబెల్ బహుమతులను ఒక స్వతంత్ర కమిటీ నిర్ణయిస్తుంది తప్ప మా ప్రభుత్వం కాదు. ఈ విషయాన్ని నేను అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తెలియజేస్తూ స్పష్టంగా ఓ లేఖ రాశాను" అని స్టోర్ తెలిపారు.
ఇక తనకు దక్కిన నోబెల్ శాంతి బహుమతి గౌరవాన్ని.. వెనెజువెలా విపక్ష నేత మారియా కొరీనా మచాడో ట్రంప్‌నకు అందజేసిన సంగతి తెలిసిందే. మచాడో నుంచి అవార్డును స్వీకరించిన అనంతరం ట్రంప్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. ధన్యావాదాలు కూడా తెలిపారు. అయితే.. దీనిపై నోబెల్ కమిటీ తాజాగా మరోసారి స్పందించింది.
‘‘ఒకసారి నోబెల్ ప్రకటించిన తర్వాత.. దానిని రద్దు, బదిలీ చేయడం లేదంటే ఇతరులతో పంచుకోవడం కుదరదని స్పష్టం చేసింది. ఒకవేళ గ్రహీతలు దానిని అమ్మేసుకున్నా.. వేలం వేసుకున్నా.. అది వాళ్ల ఇష్టం. కానీ, ఆ గౌరవం మాత్రం మచాడో పేరు మీదనే ఉంటుంది. కాబట్టి ఆయన బహుమతి చెల్లదు’’ అని కమిటీ తాజాగా మరో ప్రకటనలో తెలిపింది.
గ్రీన్‌ల్యాండ్ విషయంలో తనకు అభ్యంతరాలు చెబుతున్న యూరప్ దేశాలపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే భారీ సుంకాల పెంపును ప్రతిపాదించారు కూడా. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నార్వే ప్రధాని స్టోర్, ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ సంయుక్తంగా ట్రంప్‌నకు ఒక సందేశం పంపారు. అయితే దానికి బదులుగా ట్రంప్.. ‘‘సుమారు ఎనిమిది యుద్ధాలను ఆపిన నాకు మీ దేశం (నార్వే) నోబెల్ శాంతి బహుమతి ఇవ్వలేదు. అందుకే ఇకపై కేవలం శాంతి గురించి మాత్రమే ఆలోచించాల్సిన బాధ్యత నాకు లేదు’’ అంటూ రిప్లై ఇచ్చారు.


