breaking news
neighbourhood
-
సూర్యతాపానికి తుంపర్లతో చెక్
భానుడి భగభగలకు చైనీయులు అత్యంత వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే షాన్జీ ప్రావిన్స్‌లోని యూన్చెంగ్ నగరంలోని ఇరుగుపొరుగు ఎత్తయిన భవనాల్లోని స్థానికులు మాత్రం ఈ సూర్యతాపానికి విరుగుడు కనిపెట్టాలనే కృతనిశ్చయంతో ముందడుగువేసి సఫలీకృతమయ్యారు. బిందుసేద్యం తరహాలో పైపులతో పెద్ద ఎత్తున సూక్ష్మస్థాయిలో తుంపర్ల వర్షం పడేలా ఒక ప్రత్యేక ఏర్పాటుచేశారు.ఇది చూసి అటుగా వెళ్లే వాళ్లు ఔరా అని మెచ్చుకుంటున్నారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆరేడు భవనాల మిద్దె మీద అన్ని వైపులా ఏకరీతిగా తుంపర్లు చాలా దూరందాకా పడేలా పైపింగ్ వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీంతో సూర్యుడు నడినెత్తిన ఉండి ఉష్ణోగ్రతను పెంచేసినప్పుడు ఈ మిస్టింగ్ సిస్టమ్‌ను ఆన్ చేస్తారు. దీంతో అత్యధిక పీడనంతో నీరు ఆ నాజిల్‌ల గుండా బయటికొచ్చి సూక్ష్మాతిసూక్ష్మమైన నీటి బిందువులుగా నలువైపులా పరుచుకుంటుంది. అప్పటికే బయట ఉన్న వేడికి ఈ తుంపర్లు వెంటనే ఆవిరైపోతాయి.అవి ఆవిరవుతూ చుట్టూతా ఉన్న వేడిని తగ్గిస్తాయి. దీంతో ఆయా అపార్ట్మెంట్ వాసులతోపాటు కింద నేల మీద, అక్కడి చెట్లు, పాదచారుల బాటలనూ ఒక్కసారిగా చల్లబరుస్తాయి. ఈ మిస్టింగ్ సిస్టమ్‌ను ఆరంభించిన నాటి నుంచి ఈ తుంపర్ల చల్లదనాన్ని ఆస్వాదించేందుకు ఎంతో మంది ఎగబడుతున్నారు. అటుగా వెళ్లేవాళ్లు సైతం వీటిని చూసి వర్షపు జలపాతాలుగా వర్ణిస్తున్నారు.తుంపర్ల మీద నుంచి పరావర్తనం చెందే సూర్యకిరణాలతో అక్కడ తరచూ ఇంద్రధనస్సు ఏర్పడుతుండటం చూపరులనూ ఆకట్టుకుంటోంది. బయటి ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్ ఉన్న సమయంలో మిస్టింగ్ సిస్టమ్‌ను ఆన్ చేసినప్పుడు దీని కారణంగా ఒకేసారి ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతోందని ఈ వ్యవస్థ నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయక ఎయిర్‌కండీషన్ వ్యవస్థలతో పోలిస్తే భౌతికశాస్త్ర సూత్రాలపై పనిచేసే ఈ వ్యవస్థతో విద్యుత్ వినియోగం సైతం చాలా తక్కువ. కేవలం అత్యధిక పీడన నాజిళ్లు, పైపులు, నీళ్లు సరిపోతాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘బడ్జెట్’తో బుద్ధి చెప్పిన భారత్.. తేరుకోని బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2026-27 కేంద్ర బడ్జెట్లో పొరుగు దేశం బంగ్లాదేశ్‌కు ఇచ్చే అభివృద్ధి సహాయాన్ని భారత్ భారీగా తగ్గించింది. గత ఏడాది బడ్జెట్లో బంగ్లాదేశ్‌కు రూ. 120 కోట్లు కేటాయించగా, ఈసారి ఆ మొత్తాన్ని సగానికి అంటే రూ. 60 కోట్లకు కుదించింది. దీని వెనుకగల కారణం ఏమిటి? మిగిలిన పొరుగు దేశాల విషయంలో ఉదారత చూపిన భారత్ ‘బంగ్లా’ విషయంలో ఎందుకిలా చేసింది?భూటాన్‌కు అత్యధిక సాయంగత కొంతకాలంగా భారత్- బంగ్లాదేశ్ మధ్య సఖ్యత కొరవడింది. ఢాకాలో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, ఆ దేశంలో మైనారిటీలపై జరుగుతున్న దాడులు, దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం బడ్ఢెట్ కేటాయింపుల విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా పొరుగు దేశాలైన భూటాన్.. భారత్ నుంచి రూ.2,288 కోట్లతో అత్యధికంగా లబ్ధి పొందుతుండగా, నేపాల్‌కు రూ. 800 కోట్లు, మాల్దీవులు, మారిషస్‌లకు చెరో రూ. 550 కోట్లు కేటాయించారు.క్షీణించిన ద్వైపాక్షిక సంబంధాలు2024 ఆగస్టు 5న బంగ్లాదేశ్‌లో అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయినప్పటి నుండి భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా హిందూ మైనారిటీలపై జరుగుతున్న హింసపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే సమయంలో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పాకిస్థాన్‌తో సన్నిహితంగా ఉండటం గమనార్హం. భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఇప్పటికే బంగ్లాదేశీయులకు టూరిస్ట్ వీసాలను పరిమితం చేయడమే కాకుండా, ఫిబ్రవరి 12న జరగనున్న ఎన్నికల నేపథ్యంలో తమ దౌత్యవేత్తల కుటుంబాలను వెనక్కి పిలిపించింది. బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ ఇటీవల పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయి, ఆ దేశంతో సంబంధాలను బలపరుచుకోవడం భారత్‌కు తీవ్ర అసంతృప్తి కలిగించింది.క్రీడారంగానికీ పాకిన వైరంఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్యపరమైన ఉద్రిక్తతలు కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా క్రీడారంగానికి కూడా పాకాయి. ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి బంగ్లా బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించడంతో మొదలైన వివాదం మరింత ముదిరింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్ నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించడంతో, బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుండి తప్పుకుంది. మరోవైపు, పాకిస్థాన్ జట్టు ఈ మెగా టోర్నీలో పాల్గొనేందుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతించినప్పటికీ, ఆతిథ్య దేశమైన భారత్‌తో తలపడకూడదని ఆంక్షలు విధించింది. దీనివల్ల ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్ డైలమాలో పడింది.తాలిబాన్ ప్రభుత్వానికి సహకారం పెంపుఒకవైపు బంగ్లాదేశ్‌కు నిధులు తగ్గించినా, మరోవైపు ఆఫ్ఘనిస్థాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. తాలిబాన్ ప్రభుత్వంతో దౌత్యపరమైన చర్చలు జరిపిన భారత్, ఆ దేశానికి ఇచ్చే సాయాన్ని రూ. 150 కోట్లకు పెంచింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ బడ్జెట్లో మొత్తం రూ. 22,118 కోట్లు కేటాయించారు. మైనారిటీల రక్షణ విషయంలో బంగ్లాదేశ్‌ను నిలదీస్తూనే, భూటాన్, నేపాల్, శ్రీలంక వంటి దేశాల్లో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ ప్రాజెక్టుల ద్వారా తన ‘నైబర్‌హుడ్ ఫస్ట్’ విధానాన్ని భారత్ కొనసాగిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకకు రూ. 400 కోట్లు, మయన్మార్‌కు రూ. 300 కోట్లు కేటాయించి , ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేసే ప్రయత్నం చేసింది.ఇది కూడా చదవండి: ‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు -
పచ్చదనం మహిళల జీవితకాలాన్ని పొడిగిస్తుంది!
పచ్చదనం, పరిశుభ్రత ఆరోగ్యాన్నిస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అయితే పరిసర ప్రాంతాలు చెట్లతో నిండి ఉండటం ముఖ్యంగా మహిళల్లో జీవిత కాలాన్ని పెంచుతుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఆధునిక కాలంలో కాంక్రీట్ అడవుల్లో నివపిస్తూ.. అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడితో జీవన ప్రమాణాలను కోల్పోతున్న మహిళలు, పచ్చని ప్రాంతాలకు దగ్గరగా ఉంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉండి, ఆయుష్షును పెంచుకోవాలంటే పచ్చదనానికి దగ్గరగా ఉండాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్ (ఎన్ఐఈహెచ్ఎస్) అధ్యయనాలు చెప్తున్నాయి. వృక్ష సంపదను కలిగిఉన్న ప్రాంతాల్లో జీవనం సాగించడంవల్ల ఆరోగ్యాన్ని పొదడంతోపాటు అధికంగా జీవిస్తారని చెప్తున్నారు. పల్లెటూళ్ళలో నివసించే అవకాశం లేనివారు, గృహ ప్రాంగణాల్లోనూ, ఇంటి చుట్టుపక్కలా చెట్లు, పచ్చికబైళ్ళు ఉండేట్టు చూసుకోవాలని... ఇలా పచ్చదనానికి దగ్గరగా ఉండేవారిలో ఇతరులకన్నా12 శాతం మరణాల రేటు తక్కువగా ఉందని అధ్యయనకారులు చెప్తున్నారు. మూత్రపిండాలు, శ్వాసకోశ వ్యాధులతోపాటు క్యాన్సర్ తో మరణించే శాతం పచ్చదనానికి దగ్గరలో ఉన్నవారిలో అతి తక్కువగా ఉన్నట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. వృక్షాలు, మొక్కలు, పచ్చికబైళ్ళతో కూడుకున్న వాతావరణం వల్ల మరణాల శాతం కూడ తగ్గే అవకాశం ఉండొచ్చని పరిశోధనల్లో తెలుసుకున్నారు. ముఖ్యంగా పచ్చదనం మనుషుల్లో మానసిక శాంతిని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని, గాలిలో కాలుష్యం తగ్గేందుకు దోహదపడుతుందని అధ్యయనకారులు తెలుసుకున్నారు. చెట్లు, మొక్కలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయని, అంతేకాక శరీర సౌందర్యాన్ని కూడ పెంపొందిస్తాయని ఎన్ఐఈహెచ్ఎస్ డైరెక్టర్ లిండా బిర్న్ బాబ్ తెలిపారు. దీనికి తోడు శాకాహారం కూడ అత్యంత ఆరోగ్యాన్ని కలిగిస్తుందని, జీవితకాలాన్ని పొడిగిస్తుందని తెలిపారు. వయసు, జాతి, ధూమపానం, సామాజిక ఆర్థిక స్థితిగతులు మరణాల రేట్లను సూచించినప్పటికీ... పచ్చదనం మాత్రం మరణాల రేటును తగ్గిస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదని పరిశోధకులు ఎన్విరాన్మెంటల్ హెల్త్ పెరస్పెక్టివ్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనాల్లో వివరించారు.


