పచ్చని ప్రాంతాలకు దగ్గరగా ఉంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో జీవితకాలం పెరుగుతుందని చెప్తున్నారు.
పచ్చదనం, పరిశుభ్రత ఆరోగ్యాన్నిస్తాయన్నది మనకు తెలిసిన విషయమే. అయితే పరిసర ప్రాంతాలు చెట్లతో నిండి ఉండటం ముఖ్యంగా మహిళల్లో జీవిత కాలాన్ని పెంచుతుందని తాజా అధ్యయనాలు చెప్తున్నాయి. ఆధునిక కాలంలో కాంక్రీట్ అడవుల్లో నివపిస్తూ.. అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడితో జీవన ప్రమాణాలను కోల్పోతున్న మహిళలు, పచ్చని ప్రాంతాలకు దగ్గరగా ఉంటే ప్రయోజనాలు అధికంగా ఉంటాయని పరిశోధకులు సూచిస్తున్నారు.
మహిళలు ఆరోగ్యంగా ఉండి, ఆయుష్షును పెంచుకోవాలంటే పచ్చదనానికి దగ్గరగా ఉండాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ హెల్త్ సైన్సెస్ (ఎన్ఐఈహెచ్ఎస్) అధ్యయనాలు చెప్తున్నాయి. వృక్ష సంపదను కలిగిఉన్న ప్రాంతాల్లో జీవనం సాగించడంవల్ల ఆరోగ్యాన్ని పొదడంతోపాటు అధికంగా జీవిస్తారని చెప్తున్నారు. పల్లెటూళ్ళలో నివసించే అవకాశం లేనివారు, గృహ ప్రాంగణాల్లోనూ, ఇంటి చుట్టుపక్కలా చెట్లు, పచ్చికబైళ్ళు ఉండేట్టు చూసుకోవాలని... ఇలా పచ్చదనానికి దగ్గరగా ఉండేవారిలో ఇతరులకన్నా12 శాతం మరణాల రేటు తక్కువగా ఉందని అధ్యయనకారులు చెప్తున్నారు. మూత్రపిండాలు, శ్వాసకోశ వ్యాధులతోపాటు క్యాన్సర్ తో మరణించే శాతం పచ్చదనానికి దగ్గరలో ఉన్నవారిలో అతి తక్కువగా ఉన్నట్లు అధ్యయనకారులు కనుగొన్నారు. వృక్షాలు, మొక్కలు, పచ్చికబైళ్ళతో కూడుకున్న వాతావరణం వల్ల మరణాల శాతం కూడ తగ్గే అవకాశం ఉండొచ్చని పరిశోధనల్లో తెలుసుకున్నారు.
ముఖ్యంగా పచ్చదనం మనుషుల్లో మానసిక శాంతిని, ఆరోగ్యాన్ని కలిగిస్తుందని, గాలిలో కాలుష్యం తగ్గేందుకు దోహదపడుతుందని అధ్యయనకారులు తెలుసుకున్నారు. చెట్లు, మొక్కలు ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తాయని, అంతేకాక శరీర సౌందర్యాన్ని కూడ పెంపొందిస్తాయని ఎన్ఐఈహెచ్ఎస్ డైరెక్టర్ లిండా బిర్న్ బాబ్ తెలిపారు. దీనికి తోడు శాకాహారం కూడ అత్యంత ఆరోగ్యాన్ని కలిగిస్తుందని, జీవితకాలాన్ని పొడిగిస్తుందని తెలిపారు. వయసు, జాతి, ధూమపానం, సామాజిక ఆర్థిక స్థితిగతులు మరణాల రేట్లను సూచించినప్పటికీ... పచ్చదనం మాత్రం మరణాల రేటును తగ్గిస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదని పరిశోధకులు ఎన్విరాన్మెంటల్ హెల్త్ పెరస్పెక్టివ్ జర్నల్ లో ప్రచురించిన అధ్యయనాల్లో వివరించారు.