సూర్యతాపానికి తుంపర్లతో చెక్‌ | China Turns Rooftops Into Rainclouds: China viral rooftop mist is cooling entire neighbourhood | Sakshi
Sakshi News home page

సూర్యతాపానికి తుంపర్లతో చెక్‌

Jul 3 2026 5:20 AM | Updated on Jul 3 2026 5:20 AM

 China Turns Rooftops Into Rainclouds: China viral rooftop mist is cooling entire neighbourhood

భానుడి భగభగలకు చైనీయులు అత్యంత వేడిమితో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే షాన్జీ ప్రావిన్స్‌లోని యూన్‌చెంగ్‌ నగరంలోని ఇరుగుపొరుగు ఎత్తయిన భవనాల్లోని స్థానికులు మాత్రం ఈ సూర్యతాపానికి విరుగుడు కనిపెట్టాలనే కృతనిశ్చయంతో ముందడుగువేసి సఫలీకృతమయ్యారు. బిందుసేద్యం తరహాలో పైపులతో పెద్ద ఎత్తున సూక్ష్మస్థాయిలో తుంపర్ల వర్షం పడేలా ఒక ప్రత్యేక ఏర్పాటుచేశారు.

ఇది చూసి అటుగా వెళ్లే వాళ్లు ఔరా అని మెచ్చుకుంటున్నారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ఆరేడు భవనాల మిద్దె మీద అన్ని వైపులా ఏకరీతిగా తుంపర్లు చాలా దూరందాకా పడేలా పైపింగ్‌ వ్యవస్థను ఏర్పాటుచేశారు. దీంతో సూర్యుడు నడినెత్తిన ఉండి ఉష్ణోగ్రతను పెంచేసినప్పుడు ఈ మిస్టింగ్‌ సిస్టమ్‌ను ఆన్‌ చేస్తారు. దీంతో అత్యధిక పీడనంతో నీరు ఆ నాజిల్‌ల గుండా బయటికొచ్చి సూక్ష్మాతిసూక్ష్మమైన నీటి బిందువులుగా నలువైపులా పరుచుకుంటుంది. అప్పటికే బయట ఉన్న వేడికి ఈ తుంపర్లు వెంటనే ఆవిరైపోతాయి.

అవి ఆవిరవుతూ చుట్టూతా ఉన్న వేడిని తగ్గిస్తాయి. దీంతో ఆయా అపార్ట్‌మెంట్‌ వాసులతోపాటు కింద నేల మీద, అక్కడి చెట్లు, పాదచారుల బాటలనూ ఒక్కసారిగా చల్లబరుస్తాయి. ఈ మిస్టింగ్‌ సిస్టమ్‌ను ఆరంభించిన నాటి నుంచి ఈ తుంపర్ల చల్లదనాన్ని ఆస్వాదించేందుకు ఎంతో మంది ఎగబడుతున్నారు. అటుగా వెళ్లేవాళ్లు సైతం వీటిని చూసి వర్షపు జలపాతాలుగా వర్ణిస్తున్నారు.

తుంపర్ల మీద నుంచి పరావర్తనం చెందే సూర్యకిరణాలతో అక్కడ తరచూ ఇంద్రధనస్సు ఏర్పడుతుండటం చూపరులనూ ఆకట్టుకుంటోంది. బయటి ఉష్ణోగ్రత 38 డిగ్రీ సెల్సియస్‌ ఉన్న సమయంలో మిస్టింగ్‌ సిస్టమ్‌ను ఆన్‌ చేసినప్పుడు దీని కారణంగా ఒకేసారి ఐదు నుంచి ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతోందని ఈ వ్యవస్థ నిర్వాహకులు చెబుతున్నారు. సంప్రదాయక ఎయిర్‌కండీషన్‌ వ్యవస్థలతో పోలిస్తే భౌతికశాస్త్ర సూత్రాలపై పనిచేసే ఈ వ్యవస్థతో విద్యుత్‌ వినియోగం సైతం చాలా తక్కువ. కేవలం అత్యధిక పీడన నాజిళ్లు, పైపులు, నీళ్లు సరిపోతాయి.           – సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement