ఇస్లామాబాద్: పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్(73)ను వైద్య పరీక్షల కోసం ఇస్లామాబాద్‌లోని షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి తరలించాలని పాకిస్థాన్ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్‌ను ఆసుపత్రిలో చేర్పించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
జైలు అధికారులు ఆయన కుటుంబ సభ్యులతో వారానికి ఒకసారి సమావేశం అయ్యేలా చూడాలని కూడా ఆదేశించింది. 2023 నుంచి ఖాన్ అదియాలా జైలులో ఉన్నారు. అల్-ఖాదిర్ ట్రస్ట్, ప్రభుత్వ బహుమతుల కేసుల్లో అవినీతి, అధికారిక ప్రభుత్వ రహస్యాల లీక్, చట్టవిరుద్ధ వివాహం సహా పలు నేరారోపణలు, పెండింగ్ కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు.
మంగళవారం కోర్టు వైద్య బోర్డును ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ బోర్డులో ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిగత వైద్యుడు, ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌ను కూడా భాగస్వామ్యం చేయాలని సూచించింది. కంటి సమస్యకు చికిత్స కోసం ఇంతకుముందు కూడా ఆయనను ఇస్లామాబాద్‌లోని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రికి పలుసార్లు తరలించారు.
ఆయనకు కుడి కంటిలోని కేంద్ర రెటీనా సిరలో రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడిన సమస్య ఉంది. ఈ సమస్య తొలిసారిగా జనవరి చివర్లో వెలుగులోకి వచ్చింది. అదియాలా జైలు అధికారులు ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మెరుగుపడుతోందని గతంలో తెలిపారు. ఆయన కంటిలో స్పష్టమైన మెరుగుదల కనిపించిందని, చూపు దాదాపు సాధారణ స్థితికి తిరిగి వచ్చిందని చెప్పారు.


