సినిమా అంటే కథ, నటన, గ్రాఫిక్స్.. ఇలా అన్నింటినీ బేరీజు వేసుకుని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారు. అన్నింటి కంటే ముందు రివ్యూలు చూస్తుంటారు. అయితే ఇక్కడ ఓ సినిమా విషయంలో.. పూర్తి భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. ‘పరమ చెత్త సినిమా’ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిని చూసేందుకు ఎగబడి పోతున్నారు. తొలుత ఎవరూ పట్టించుకోని ఈ సినిమా.. ఇప్పుడు అదే విమర్శలతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
‘నియు లాయ్’ (Niu Lai) అంటే చైనా భాషలో ‘ది కౌ ఈజ్ కమింగ్’. 86 నిమిషాల నిడివి ఉన్న ఈ యానిమేషన్ సినిమాలో ఓ దూడ, ఓ స్కైలార్క్ పక్షి మధ్య సంబంధాన్ని కలలలాంటి.. అర్థంపర్థం లేని సన్నివేశాల ద్వారా చూపించారు. కథ, పాత్రలు, గ్రాఫిక్స్, వాయిస్ యాక్టింగ్.. అన్నింటిపైనా ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి.
ఆగస్టు 5న చైనాలో విడుదలైన ఈ సినిమా మొదటి పది రోజుల్లో కేవలం 7,700 యువాన్లు మాత్రమే వసూలు చేసింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.04 లక్షలు. దేశవ్యాప్తంగా 300 మందికంటే తక్కువ మంది మాత్రమే టికెట్లు కొనుగోలు చేశారు. ప్రచారం లేదు.. ప్రీ-రిలీజ్ ఈవెంట్లు లేవు.. కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు.

ఆ రివ్యూనే మలుపు తిప్పింది
అయితే సినిమాకు సంబంధించిన కొన్ని క్లిప్‌లు సోషల్ మీడియాలోకి రావడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. సినిమాలోని నాసిరకం కంప్యూటర్ గ్రాఫిక్స్, బిగుసుకుపోయినట్లు కనిపించే పాత్రలు, విచిత్రమైన వాయిస్‌లు, గందరగోళమైన కథపై నెటిజన్లు జోకులు పేల్చారు. కొందరు దీన్ని విద్యార్థులు చేసిన ప్రాజెక్ట్‌తో పోల్చగా.. మరికొందరు ‘ఏఐ కంటే దారుణం’, ‘2026లో వచ్చిన అత్యంత చెత్త సినిమా’ అంటూ కామెంట్లు చేశారు.
అయితే ఈ విమర్శలే సినిమాకు ఊహించని ప్రచారాన్ని తెచ్చిపెట్టాయి. ‘ఇంత చెత్తగా ఉందట.. అసలు ఎలా ఉంటుందో చూద్దాం’ అంటూ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో సినిమాపై ఆసక్తి అనూహ్యంగా పెరిగింది.
రూ.20 కోట్లకు పైగా వసూళ్లు
చైనీస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ మాయాన్ గణాంకాల ప్రకారం.. సినిమా ఇప్పటివరకు 14.9 మిలియన్ యువాన్లకు పైగా వసూలు చేసింది. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.20 కోట్లు. దీంతో భారీ బడ్జెట్ సినిమాల మధ్య ఈ చిన్న యానిమేషన్ కూడా బాక్సాఫీస్ రేసులో కనిపిస్తోంది. ఇదే సమయంలో ‘ది ఒడిస్సీ’, ‘స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ వంటి భారీ చిత్రాలతో పోలుస్తూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. భారీ ప్రమోషన్లు, పెద్ద స్టార్లు, కోట్లాది రూపాయల బడ్జెట్ లేకుండానే ‘నియు లాయ్’ అందరి దృష్టినీ ఆకర్షించడం విశేషంగా మారింది.

ఇద్దరి కష్టం.. ఐదేళ్లపాటు!
ఈ సినిమా వెనుక కూడా ఆసక్తికరమైన కథే ఉంది. జిన్ యుమెంగ్, సన్ లిఫాంగ్ అనే ఇద్దరు వ్యక్తులు దాదాపు ఐదేళ్లపాటు ఈ చిత్రంపై పనిచేసినట్లు సమాచారం. తల్లీకొడుకులుగా భావిస్తున్న వీరిద్దరే రచయితలు, దర్శకులు, నిర్మాతలు, వాయిస్ ఆర్టిస్టులుగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. సినిమాకు ఉన్న ఏకైక ప్రచార పోస్టర్ మాత్రం ఎంతో అందంగా ఉంది. సంప్రదాయ చైనీస్ ఇంక్-వాష్ పెయింటింగ్‌ను తలపించేలా రూపొందించిన ఆ పోస్టర్‌కు.. సినిమాలో కనిపించే ముడతలు పడినట్లున్న యానిమేషన్‌కు అసలు పోలిక లేకపోవడం మరో చర్చగా మారింది.
‘విడుదల చేయొద్దు’ అనుకుని..
సినిమా నాణ్యతపై సందేహాలు వ్యక్తం చేస్తూ విడుదల చేయకపోవడమే మంచిదని తనకు సలహా వచ్చిందని చిత్ర పంపిణీదారు చెప్పినట్లు సమాచారం. అయితే దర్శకుడితో స్నేహం కారణంగా సినిమాను విడుదల చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు కొందరు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను పూర్తిగా చెత్తగా చూడటం లేదు. ఏఐ సాయంతో క్షణాల్లో అద్భుతమైన విజువల్స్ రూపొందిస్తున్న కాలంలో.. ఇద్దరు వ్యక్తులు ఐదేళ్లపాటు కష్టపడి రూపొందించిన ముడి, చేతిపని తరహా యానిమేషన్ తమకు కొత్తగా అనిపించిందని చెబుతున్నారు.
చెత్తే.. కానీ అదే హిట్!
సినిమా బాగుందని ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం సాధారణం. కానీ సినిమా ఎంత చెత్తగా ఉందో తెలుసుకునేందుకే టికెట్ కొనడం ఇప్పుడు ‘నియు లాయ్’ను ప్రత్యేకంగా నిలబెడుతోంది. మొదట్లో సినిమాను చంపేసిన విమర్శలే.. చివరికి దానికి ఉచిత ప్రచారంగా మారాయి. అంటే.. ఈ సినిమాకు అసలు బలం కథ కాదు.. దాని ‘చెత్త’ పేరే!.


