మృత్యు కౌగిలి ఇచ్చిన కలల హనీమూన్‌ | Three killed in helicopter crash on popular Greek island | Sakshi
Sakshi News home page

మృత్యు కౌగిలి ఇచ్చిన కలల హనీమూన్‌

Aug 18 2026 2:24 PM | Updated on Aug 18 2026 2:43 PM

Three killed in helicopter crash on popular Greek island

హనీమూన్‌.. జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకాలను మిగిల్చే ప్రయాణం. కానీ అదే ప్రయాణం ఓ కొత్త జంట జీవితాల్లో చివరి ప్రయాణంగా మారింది. గ్రీస్‌లోని సిఫ్నోస్‌ ద్వీపానికి హనీమూన్‌ కోసం బయల్దేరిన బ్రిటిష్‌ దంపతులు.. గమ్యస్థానానికి చేరుకునే కొద్దిసేపటి ముందు హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కలల సౌధాన్ని నిర్మించుకోవాల్సిన సమయంలో.. మృత్యువు వారిని కబళించింది. హనీమూన్‌ జ్ఞాపకాలతో తిరిగి రావాల్సిన దంపతులు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

గ్రీస్‌లోని ప్రముఖ పర్యాటక ద్వీపం సిఫ్నోస్‌లో హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హనీమూన్‌కు వెళ్లిన బ్రిటిష్ దంపతులు అలెగ్జాండర్ క్రోమీ, మేరీ ఎబర్ట్, హెలికాప్టర్ పైలట్ జియోర్గోస్ రైకోస్ మృతి చెందారు. కొత్త జీవితానికి నాంది పలకాల్సిన హనీమూన్‌.. మూడు ప్రాణాలను బలిగొన్న విషాద ఘటనగా మిగిలిపోయింది.

సోమవారం సాయంత్రం సుమారు 6:15 గంటలకు, హెలికాప్టర్ సిఫ్నోస్‌లోని థోలోస్ ప్రాంతంలో ల్యాండ్ కావడానికి కొన్ని నిమిషాల ముందు అదుపు తప్పి కిందపడింది. కుప్పకూలిన వెంటనే మంటలు చెలరేగాయి. సీసీటీవీ దృశ్యాల్లో హెలికాప్టర్ గాల్లో తిరుగుతూ కిందపడినట్లు కనిపించింది.

ప్రమాదానికి ముందు వింతగా, భారీ శబ్దం వినిపించిందని స్థానికులు తెలిపారు. హెలికాప్టర్‌లో సాంకేతిక లోపం కారణమై ఉండొచ్చని సిఫ్నోస్ డిప్యూటీ మేయర్ తెలిపారు. అయితే ప్రమాదానికి అసలు కారణం ఇంకా అధికారికంగా నిర్ధారించలేదు. దర్యాప్తు కొనసాగుతోంది. బ్రిటన్ విదేశాంగ కార్యాలయం గ్రీక్ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందిస్తున్నట్లు తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement