‘హర్మూజ్‌ జలసంధి మాదే’.. మ్యాప్‌ విడుదల చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌ | Trump posts image claiming Strait of Hormuz new US territory | Sakshi
Sakshi News home page

‘హర్మూజ్‌ జలసంధి మాదే’.. మ్యాప్‌ విడుదల చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌

Aug 18 2026 6:00 PM | Updated on Aug 18 2026 6:57 PM

Trump posts image claiming Strait of Hormuz new US territory

వాషింగ్టన్/టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ప్రపంచంలోనే అత్యంత వ్యూహాత్మక చమురు రవాణా మార్గం హర్మూజ్‌ జలసంధి కొత్త అమెరికా భూభాగంగా పేర్కొంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా ఏఐ జనరేటెడ్ మ్యాప్ ఫొటోను పోస్ట్ చేశారు. ఇరాన్‌తో నెలకొన్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

అయితే, ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. హర్మూజ్‌ జలసంధి తమదేనని, అది తమ నియంత్రణలోనే ఉంటుందని ఇరాన్ స్పష్టం చేసింది. గతంలో ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజెమ్ ఘరీబాబాదీ మాట్లాడుతూ.. హర్మూజ్‌ ‘ఇరాన్‌దే, ఇరాన్‌దిగానే ఉంటుంది’ అని స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌ను తిరిగి తెరవడం అమెరికా,ఇరాన్ చర్చల్లో ప్రధాన అంశంగా మారింది. అమెరికా ఆంక్షలు, నౌకాదళ చర్యలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ కోరుతుండగా.. అమెరికా మాత్రం జలసంధి స్వేచ్ఛగా తెరవాలని ఒత్తిడి చేస్తోంది. ఇరువైపులా రాజీ కుదరకపోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. 

చర్చలు ఎందుకు విఫలమవుతున్నాయి?
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన 60 రోజుల అవగాహన గడువు ఆగస్టు 17న ముగిసింది. అయితే, కీలక అంశాలపై పురోగతి లేకపోవడంతో ఆ ఒప్పందాన్ని పొడిగించబోమని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. హర్మూజ్‌ను తెరవడం,ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు, అమెరికా నౌకాదళ చర్యలు, ఇరాన్ అణు కార్యక్రమం వంటి అంశాలపై ఇరువర్గాల మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ మాత్రం అమెరికా ముందుగా తన సైనిక ఒత్తిడిని తగ్గించి ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది. అమెరికా మాత్రం ఇరాన్‌పై ఒత్తిడిని కొనసాగిస్తూ హర్మూజ్‌ జలసంధి పూర్తిగా తెరవాలని కోరుతోంది.

ప్రపంచ చమురు మార్కెట్‌పై ప్రభావం
హర్మూజ్ జలసంధి మూసివేత లేదా రవాణాపై పరిమితులు కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాకు భారీ దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ఉద్రిక్తతల కారణంగా నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా చమురు ధరలు, రవాణా వ్యయాలు, బీమా ఖర్చులు పెరిగే ప్రమాదం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement