‘‘ఈ నెలాఖరుకు చంపేస్తా’’  | Florida man told ChatGPT he had murder his ex, OpenAI alerted the FBI | Sakshi
Sakshi News home page

‘‘ఈ నెలాఖరుకు చంపేస్తా’’ 

Aug 18 2026 6:35 AM | Updated on Aug 18 2026 6:35 AM

Florida man told ChatGPT he had murder his ex, OpenAI alerted the FBI

మాజీ ప్రియురాలిపై ఛాట్‌ జీపీటీతో వ్యక్తి సంభాషణ 

ఎప్‌బీఐని అప్రమత్తం చేసిన ఓపెన్‌ ఏఐ 

కేసు నమోదు, అరెస్ట్, శిక్ష! 

మాజీ ప్రియురాలిని చంపేస్తానంటూ ఛాట్‌జీపీటీతో జరిపిన సంభాషణ అమెరికాకు చెందిన డారెన్‌ ఝా అనే వ్యక్తిని చిక్కుల్లో పడేసింది. బ్రేకప్‌ తరువాత మాజీ ప్రేయసిపై అక్కసునంతా ఛాట్‌జీపీటీలో వెళ్లగక్కుకున్న డారెన్‌ ‘‘ఈ నేలాఖరులోగా ఆమెను చంపేస్తా’’. ‘‘నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్కకూడదు’’లాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వడంతో ఆ సంభాషణ మొత్తాన్ని ఛాట్‌జీపీటీ యజమాని ఓపెన్‌ ఏఐ ఎఫ్‌బీఐకి ఇచ్చేసింది. దీంతో అతడిపై కేసు నమోదైంది. శిక్ష కూడా పడింది. వివరాలు... 

పాతికేళ్ల వయసున్న డారెన్‌ ఝూ అమెరికాలోని ఫ్లారిడా వాసి.నాలుగైదు నెలల క్రితం ఛాట్‌జీపీటీ వాడటం మొదలుపెట్టారు. గర్ల్‌ఫ్రెండ్‌తో తెగతెంపులై కొంత సమయమే అయ్యింది. మొదట్లో బ్రేకప్‌ గురించి, మాజీ ప్రేయసి ఇష్టాఇష్టాల గురించి ఛాట్‌జీపీటీపై వాకబు చేశాడు. ఆమె ఎక్కడెక్కడ తిరిగేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఆ అమ్మాయి ప్రేమను మళ్లీ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు అనుకుందో ఏమో... ఛాట్‌జీపీటీ కూడా అతడి ప్రశ్నలకు తగ్గ సమాధానాలిచ్చింది. 

అయితే రాను రాను డారెన్‌ మాటలు దారితప్పడం మొదలైంది. మానభంగం, హత్య, ఆత్మహత్యలపైకి మళ్లింది. ఒక మెసేజ్‌లో డారెన్‌ టిపికల్‌ భగ్న ప్రేమికుడి టైప్‌లో... ‘‘ఆమె నాకు దక్కకపోతే ఇంకెవరికీ దక్క కూడదు’’, ‘‘ఈ నెలాఖరుకు ఆమెను చంపేస్తా’’అని ఛాట్‌జీపీటీతో చెప్పినట్లు అధికారులు గుర్తించారు. అక్కడితో ఆగిపోయినా బాగుండేది. 

కానీ ఆ అమ్మాయి వెళ్లే జిమ్‌ వద్ద తాను పూలబోకేతో వేచి చూశానని, నన్ను కాదంటే అంతే అంటూ బెదిరించేందుకు సిద్ధమయ్యానని కూడా డారెన్‌ ఛాట్‌జీపటీతో చెప్పుకున్నట్లు తెలిసింది. మరికొన్ని మెసేజీల్లోనైతే తుపాకితో బెదిరించి ఇంట్లోకి జొరబడాలని, ఆపై లైంగిక దాడికి పాల్పడాలని కూడా ప్లాన్‌ చేశాడట. 

తన వద్ద ఏఆర్‌–15 రకం రైఫిల్, గ్లాక్‌ హ్యాండ్‌ గన్, 12–గేజ్‌ షాట్‌గన్‌లు కూడా ఉన్నట్లు, వీటి ఫొటోలతోపాటు, రబ్బరు గ్లౌవ్స్, జిప్‌టైల ఫొటోలు కూడా మాజీ ప్రియురాలికి పంపినట్లు డారెన్‌ ఛాట్‌జీపీటీతో పంచుకున్నాడు. ‘‘ఆమెకు టెక్స్‌ట్‌ చేశా. ఈ రాత్రి మానభంగం చేస్తున్నా’’అని ప్రకటించాడు కూడా.  

అదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదు కానీ.. ఛాట్‌జీపీటీ యజమాని ఓపెన్‌ ఏఐలో కదలిక మొదలైంది. మొత్తం వ్యవహారాన్ని వారు నేరుగా ఎఫ్‌బీఐకి రిపోర్టు చేశారు. దీంతో మే నెలలో డారెన్‌ అరెస్ట్‌ కూడా జరిగింది. బెదిరింపులు, వెంటపడటం, సెల్‌ఫోన్‌ అక్రమ వినియోగం వంటి కేసులు దాఖలయ్యాయి. మూడు రోజుల క్రితం డారెన్‌ తన తప్పులన్నీ ఒప్పుకున్నాడు కూడా.

 కేసు విచారించిన న్యాయమూర్తి స్కాట్‌ సాస్‌కేర్‌ డారెన్‌కు ఎనిమిదేళ్ల శిక్ష (జైలు శిక్ష కాదు) విధించారు. దీని ప్రకారం మొదటి రెండేళ్లు డారెన్‌ కాలికి ఒక ఎల్రక్టానిక్‌ పరికరాన్ని బిగించుకుని తిరగాల్సి ఉంటుంది. దాంతోపాటు మానసిక ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌ను కలవడం కానీ, మత్తుమందులు, మద్యం సేవించడం కానీ, తుపాకులు కలిగి ఉండటం కానీ చేయకూడదు. నేరాలన్నీ ఒప్పుకున్నందుకు గాను డారెన్‌కు జైలుకెళ్లకుండా, ఎనిమిదేళ్ల పరిశీలనలో ఉండే అవకాశం దక్కింది. 

ఏఐ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి విచిత్రమైన, భయంకరమైన ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క ఏఐ టూల్స్‌ సాయంతో ఎన్నో క్రిమినల్‌ కేసులను పరిష్కరిస్తూండగా ఇంకో పక్క వీటిని దుర్వినియోగం చేస్తున్న ఘటనలూ ఎక్కువయ్యాయి. బెంగళూరులో ఇటీవల మూడు హత్యల కేసు నిందితుడు ఒకరు గూగుల్‌ జెమినీ ఏఐతో కొన్ని నెలలు సంభాషించి పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలిసింది. 
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement