న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ దుబాయ్‌లో చిక్కుకుపోయిన ప్రయాణికుల కోసం నటుడు, మానవతావాది సోనూ సూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఈ సంక్షోభం కారణంగా దుబాయ్‌లో తలదాచుకుంటున్న పర్యాటకులు, ప్రయాణికులకు ఉచిత వసతి కల్పిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేస్తూ, బాధితులకు అండగా ఉంటానిని భరోసా ఇచ్చారు. కరోనా మహమ్మారి సమయంలోనూ సోనూసూద్ వందలమందికి సాయం అందించారు.
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం పశ్చిమాసియాలోని విమానయాన రంగాన్ని అతలాకుతలం చేసింది. ఫిబ్రవరి చివరిలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు జరిపాయి. దానికి ప్రతిచర్యగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ పరిణామాల దృష్ట్యా భద్రతా కారణాలతో పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడం, విమాన సర్వీసులను రద్దు చేయడంతో దుబాయ్‌లో వేలాది మంది ప్రయాణికులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారు.
విమానాల రద్దు, దారిమళ్లింపుల వల్ల విమానాశ్రయాల్లోనే గంటల తరబడి నిరీక్షిస్తున్న బాధితుల కష్టాలను చూసి సోనూ సూద్ స్పందించారు. ఈ క్లిష్ట సమయంలో భారతీయులతో పాటు ఏ దేశానికి చెందిన వారైనా సరే, దుబాయ్‌లో వసతి లేక ఇబ్బంది పడుతుంటే తనకు నేరుగా మెసేజ్ పంపాలని సోనూ సూద్ కోరారు. బాధిత ప్రయాణికులు తమ స్వదేశాలకు చేరుకునే వరకు వారికి ఉచిత వసతి కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ‘మానవత్వానికి దేశ సరిహద్దులు, నిబంధనలు ఉండవు’ అని పేర్కొంటూ, దుబాయ్‌లో ఆశ్రయం అవసరమైన వారు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించాలని సూచించారు.
War has left many travelers stranded in Dubai.
If you or someone you know has nowhere to stay, we are offering safe accommodation free of cost.
No nationality. No conditions. Just humanity.
DM us on Instagram if you need help.
@dugastaproperties
Please share so this reaches… pic.twitter.com/TDDr9st79M— sonu sood (@SonuSood) March 5, 2026


