పరిశ్రమలు ఏర్పాటు చేస్తేప్రోత్సాహకాలు అందిస్తాం
స్లోవేనియా ప్రతినిధి బృందంతోమంత్రి శ్రీధర్‌బాబు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్, ఐటీ రంగాల్లో పెట్టుబడులకు ప్రభుత్వం మెరుగైన అవకాశాలు కల్పిస్తోందని చెప్పారు. బుధవారం శాసనసభ కమిటీ హాల్లో స్లోవేనియా ప్రతినిధి బృందంతో మంత్రి సమావేశమయ్యారు.
మధ్య యూరప్‌కు చెందిన సంపన్న దేశం స్లోవేనియా నుంచి వారి భారత్ రాయబారి టోమాజ్ మెన్సిన్ ఆధ్వర్యంలో వచ్చిన వాణిజ్య, పారిశ్రామిక ప్రతినిధులకు మంత్రి సాదర స్వాగతం పలికారు. యూరోపియన్ యూనియన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కారణంగా తెలంగాణ నుంచి యూరప్‌కు ఎగుమతి చేసే 99.95% ఉత్పత్తులపై సుంకాలు ఉండవని తెలిపారు. ఎఫ్‌టీఏతో విదేశీ పెట్టుబడిదారులకు రాష్ట్రంలో మరింత అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.
ఐటీ, క్లౌడ్ కంప్యూటింగ్‌లో అపార అవకాశాలు
తెలంగాణలో ఫార్మా, జీవ విజ్ఞాన రంగాలు, వాహనాల విడిభాగాల ఉత్పత్తి పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వ పరంగా అన్నిరకాల ప్రోత్సాహకాలు అందిస్తామని మంత్రి చెప్పారు. ఔషధ, బయో టెక్నాలజీ రంగాల్లో కూడా రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించిందని, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నందున ఇక్కడి మౌలిక సదుపాయాలు, పరిశ్రమలతో భాగస్వామ్యం పెట్టుబడిదారులకు లాభదాయకమవుతుందని వివరించారు.
ఐటీ అభివృద్ధి, క్లౌడ్ కంప్యూటింగ్‌లో కూడా ఇక్కడ అపారమైన అవకాశాలున్నాయని మంత్రి చెప్పారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్, పరిశ్రమల శాఖ కమిషనర్ నిఖిల్ చక్రవర్తి, స్లోవేనియా ప్రతినిధులు ఆసిఫ్ ఇక్బాల్, సుజిత్ నాయర్, కీర్తి చిలుకూరి తదితరులు పాల్గొన్నారు.


