శాంతి మంత్రంతో బౌద్ధ సన్యాసుల సరికొత్త చరిత్ర | Buddhist Monks 15 Week Peace Walk Reaches Washington | Sakshi
Sakshi News home page

శాంతి మంత్రంతో బౌద్ధ సన్యాసుల సరికొత్త చరిత్ర

Feb 11 2026 11:08 AM | Updated on Feb 11 2026 11:23 AM

Buddhist Monks 15 Week Peace Walk Reaches Washington

వాషింగ్టన్: ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ బౌద్ధ సన్యాసుల బృందం అమెరికాలోని టెక్సాస్ నుంచి ప్రారంభించిన పాదయాత్ర వాషింగ్టన్‌కు చేరుకోవడంతో ముగిసింది. గత అక్టోబర్‌లో టెక్సాస్‌లో కాలినడకన బయలుదేరిన బౌద్ధ సన్యాసుల బృందం సుమారు 15 వారాల పాటు 2,300 మైళ్లకు పైగా దూరం ప్రయాణించి, మంగళవారం తెల్లవారుజామున వాషింగ్టన్ డీసీకి చేరుకుంది. కాషాయ వస్త్రాలు ధరించి, పోటోమాక్ నదిపై ఉన్న చైన్ బ్రిడ్జిని దాటుతూ, నగరంలోకి ప్రవేశించిన సన్యాసులపై స్థానికులు పూల వర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు.

ఈ సుదీర్ఘ యాత్రలో సన్యాసుల వెన్నంటే ఉంటూ అందరి హృదయాలను గెలుచుకుంది వారి రెస్క్యూ డాగ్ ‘అలోకా’.  కరుణ, ఐక్యత, శాంతిని వ్యాప్తి చేయడమే లక్ష్యంగా ఈ పాదయాత్ర సాగింది. ఈ బౌద్ధ సన్యాసుల పాదయాత్ర మనుషుల మధ్య వైరాన్ని తగ్గించే ఒక గొప్ప ప్రయత్నంగా స్థానికులు అభివర్ణిస్తున్నారు. వీరి ప్రయాణంలో ఎదురైన సవాళ్లు  అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. గడ్డకట్టే చలి, భయంకరమైన శీతాకాలపు తుఫానులను సైతం లెక్కచేయకుండా ఈ సన్యాసులు పాదయాత్ర సాగించారు. చెప్పులు లేకుండా కూడా వీరు నడవడం అనేది వారిలోని పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

వీరి పాదయాత్రకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దీంతో ఈ యాత్ర ఒక జాతీయ ఉద్యమంగా మారిందని పలువురు అంటున్నారు. ఈ సన్యాసులకు మార్గం మధ్యలో స్థానికులు ఆహారం, ఆశ్రయం కల్పించారు. అమెరికా చరిత్రలోనే సుదీర్ఘమైన ఆధ్యాత్మిక  పాదయాత్రగా ఇది నిలిచింది. దీంతో ఈ యాత్ర  ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆసియా నుండి యూరప్ వరకు పలు దేశాలలో ఇలాంటి శాంతి యాత్రలు చేపట్టేందుకు ఇది స్ఫూర్తినిస్తోంది. వర్జీనియాలోని ఆర్లింగ్టన్‌లో సన్యాసులు తమ పాదయాత్రలోని చివరి మజిలీ పూర్తి చేశారు. తరువాత రాజధానిలోకి అడుగుపెట్టారు. ద్వేషాన్ని అంతం చేసేందుకు కరుణ ఒక్కటే మార్గమని వీరు సందేశమిచ్చారు.

ఇది కూడా చదవండి: మంచుకురిసే వేళలో.. ‘ఇగ్లూ విలేజ్‌’కి వెళితే..

Advertisement
 
Advertisement
Advertisement