
ఈశ్వర్ తిండి అలవాట్లు ఇటీవల చాలా విచిత్రంగా మారాయి. ఈమధ్య రాత్రి భోజనం కాగానే వెంటనే నిద్రపట్టడం లేదు. కాసేపాగాక ఏదైనా తిందామంటూ మాటిమాటికీ ఫ్రిజ్ తెరచి చూస్తుంటాడు. రాత్రిపూట ఆకలేయడం గుర్తుకొచ్చి ప్రతిరోజూ రాత్రి తినడం కోసం చిప్స్ అనీ, కారా అనీ... ఏదో ఒక రకమైన శ్నాక్స్ తెచ్చుకుంటూ ఉంటాడు. కొన్నిసార్లు ముందుగానే స్వీట్స్ కూడా తెచ్చిపెట్టుకుంటాడు. రాత్రి రెండు గంటలయినప్పటికీ ఆ టైమ్‌లోనైనా తింటే తప్ప నిద్రపట్టదు. ఇలా రాత్రి తినేయడంతో పొద్దున్న బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కు అంతగా ఆకలేయదు. ఈ అలవాటు వల్ల ఇటు ఆహారపు అలవాట్లూ, అటు నిద్రవేళలూ ఈ రెండూ అస్తవ్యస్తంగా మారాయి. ఎట్టకేలకు డాక్టర్‌ను సంప్రదిస్తే ఇది ఒకరకమైన రుగ్మత అనీ దీని పేరే ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్–(ఎన్‌ఈఎస్)’ అనీ తెలిసింది. ఈ అనారోగ్య సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...
ఈ కేస్ స్టడీలో ఈశ్వర్ అంతగా పట్టించుకోలేదుగానీ... ఈ అలవాటు అదేపనిగా కొనసాగుతుండటంతో కొన్ని ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి. పెందరాళే నిద్రలేవలేకపోవడంతో ఆఫీసులో మందకొడిగా మారిపోవడం, అర్ధరాత్రి తినేసి ఉండటంతో బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌కు ఆకలి లేకపోవడం... దాంతో పగలు భోజన వేళలు తప్పడం వంటి అనర్థాలు ఏర్పడతాయి. దాంతో దీర్ఘకాలంలో ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదమూ ఉంటుంది.
గుర్తించడం ఎలా...
రాత్రిళ్లు వారంలో కనీసం నాలుగు నుంచి ఐదు రాత్రులు నిద్రలేకపోవడం
ఉదయం లేచాక ఆకలి లేకపోవడం
రాత్రి భోజనం తర్వాత ఎంతకీ నిద్రపట్టకపోతే నిద్రపట్టాలంటే మళ్లీ ఏదోటి తినక తప్పదని అనుకుంటూ ఉండటం
ఒకలాంటి డిప్రెషన్ మూడ్... సాయంత్రాలు ఈ ఫీలింగ్ మరింత ఎక్కువ.
ఇలాంటిదే మరో సమస్య...
బింజ్ ఈటింగ్ డిజార్డర్ అనే మరో సమస్య కూడా ఉంది. ‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’ కంటే ఇది కాస్త వేరుగా ఉంటుంది. బింజ్ ఈటింగ్ డిజార్డర్‌లో బాధితులు ఏమాత్రం గ్యాప్ లేకుండా అదేపనిగా తినేస్తుంటారు. కానీ నైట్ ఈటింగ్ సిండ్రోమ్‌లో బాధితులు అదేపనిగా కాకుండా కొద్ది కొద్ది మొత్తాల్లో తింటుంటారు.
‘నైట్ ఈటింగ్ సిండ్రోమ్’కు కారణాలు...
ఈ సమస్యకు కారణం ఇదమిత్థంగా తెలియదు. డాక్టర్ల అంచనా ప్రకారం నిద్ర΄ోవడానికి – నిద్రలేవడానికి తోడ్పడే నిద్ర సైకిల్‌లో అస్తవ్యస్తతతోపాటు కొన్ని హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఇలా జరుగుతుంది. స్థూలకాయుల్లో ఇది కనిపించడంతోపాటు డిప్రెషన్, యాంగై్జటీతో బాధపడేవారిలో ఇది సాధారణంగా కనిపిస్తుంటుంది. సాధారణంగా నైట్ ఈటింగ్ సిండ్రోమ్ సమస్య ప్రతి వందమందిలో ఒకరి లో కనిపిస్తుంటుంది.
ఒకవేళ స్థూలకాయుల్లోనైతే ప్రతి 10 మందికి ఒకరిలో కనిపిస్తుంది. ఇక ఈ సమస్యకూ జన్యుపరమైన అంశాలకూ సంబంధముందని వైద్యపరిశోధకులు చెబుతున్నారు. బాడీ క్లాక్‌ని నియంత్రించే ‘పీఈఆర్–1’ అనే జన్యువులోని లోపం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమవుతుందన్నది శాస్త్రవేత్తల మాట.
నిర్ధారణ పరీక్షలు:
బాధితులు తిండి, నిద్ర అలవాట్ల గురించి డాక్టర్లు తెలుసుకోవడం పాలీసోమ్నోగ్రఫీ అనే పరీక్ష సహాయంతో మెదడులోని తరంగాలు, ఆక్సిజన్ మోతాదులు, గుండె స్పందనల, శ్వాస తీసుకునే రేటు వంటి పరీక్షల సహాయంతో డాక్టర్లు ఈ సమస్యను నిర్ధారణ చేస్తారు.
ఆరోగ్యంపై ఎన్‌ఈఎస్ దుష్ప్రభావాలు... ఎన్‌ఈఎస్‌కూ స్థూలకాయానికీ సంబంధం ఉందని తెలుసుగానీ... స్థూలకాయం వల్లనే ఈ ఎన్‌ఈఎస్ వస్తుందా అన్న విషయం ఇంకా వైద్యనిపుణులకు తెలియరాలేదు. అయితే వీళ్లలో చాలామందికి స్థూలకాయం ఉంటుంది కాబట్టి ఒబేసిటీ వల్ల వచ్చే అన్ని రకాల దుష్ప్రభావాలూ ఎన్‌ఈఎస్‌లో కనిపించడానికి అవకాశముంది. ఇక కొందరిలోనైతే ఈ ఎన్‌ఈఎస్ వల్లనే తర్వాత్తర్వాత ఊబకాయం వచ్చే అవకాశమూ ఉంటుంది.
చికిత్స...
సైకియాట్రిస్టుల ఆధ్వర్యంలో కొన్ని రకాల యాంటీడిప్రెసెంట్లతో పాటు అవసరాన్ని బట్టి బిహేవియర్ థెరపీ ఇస్తారు. కొన్ని రకాల రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబిస్తూ రాత్రి తిండిని క్రమంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి షిఫ్ట్ అయ్యేలా కౌన్సెలింగ్ చేయడం ద్వారా చికిత్స అందిస్తారు.