ఇంటి హింస ఇంతింతై! | Sakshi Special Story on Battered Woman Syndrome | Sakshi
Sakshi News home page

ఇంటి హింస ఇంతింతై!

Nov 9 2025 12:27 AM | Updated on Nov 9 2025 12:27 AM

Sakshi Special Story on Battered Woman Syndrome

బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌!

బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌ అనేది మహిళలు తమ గృహహింస

కారణంగా ఎదుర్కొనే మనోవేదన. ఒకరకంగా చూస్తే తీవ్రమైన

వేదన కారణంగా అంటే రేప్‌కు గురైనవాళ్లూ, యుద్ధాల్లో సర్వం

పోగొట్టుకున్నవాళ్లూ అనుభవించే అత్యంత వేదనాభరితమైన

కండిషన్‌తో వచ్చే పోస్ట్‌ ట్రామాటిక్‌ స్ట్రెస్‌ డిజార్డర్‌ (పీటీఎస్‌డీ)లో

ఇదో రకం అని చెప్పవచ్చు. మహిళలు తమ పార్ట్‌నర్‌ చేతుల్లో

అనుభవించిన గృహహింస కారణంగా ఇది తమ ఖర్మ అంటూ

సమాధానపడుతూ నిత్యం అనుభవించే రంపపుకోత కారణంగా

వాళ్లు అనుభవించే మానసిక సమస్యే ఈ ‘బ్యాటర్‌డ్‌ ఉమన్‌

సిండ్రోమ్‌’. ఈ మానసిక సమస్యపై అవగాహన కోసమే ఈ కథనం...

పెళ్లి తర్వాత భర్త లేదా జీవిత భాగస్వామి పెట్టే వేదనలను అనుభవించే భార్యల్లో కొందరికి ఇది తమ ఖర్మ అనే ఫీలింగ్‌ తప్ప... దీన్ని ఎదుర్కోవాలనిపించడం, పోలీసులకు ఫిర్యాదు చేయాలనిపించడం కూడా ఉండదు. అలా మొదలయ్యే ‘బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌’లో ఆ మహిళ... తన భర్త అలా హింసిస్తుండటాన్ని కూడా తన తప్పుగానే అనుకుంటూ ‘అపరాధభావన’తో బాధపడుతుంటుంది.

సిండ్రోమ్‌ తాలూకు నాలుగు దశలివి...
బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌కు దారితీసే వాళ్ల వాళ్ల ఇంటి పరిస్థితులు ప్రతి మహిళకూ వేర్వేరుగా ఉన్నప్పటికీ... వారు అనుభవించే కొన్ని కామన్‌ దశలను బట్టి చూసినప్పుడు వారి మానసిక స్థితి ఈ కింద పేర్కొన్న నాలుగు దశల్లో కొనసాగుతుంది. మొదటి రెండు దశల్లో మహిళలు నిశ్శబ్దంగా తమ వేదనలు అనుభవించినప్పటికీ... ఈ వేదనల నుంచి బయటకు వచ్చేందుకు తాము చేసే ప్రయత్నాలు ఈ చివరి రెండు దశల్లో కొంతమేర జరుగుతాయి.

1. డీనియల్‌ : తాము వేదన అనుభవిస్తున్న సంగతి తెలియని పరిస్థితి ఇది. భర్త తమను వేధిస్తున్నారని కూడా వాళ్లు అంగీకరించరు. అదేదో ఈసారికి అలా జరిగింది తప్ప భర్త తమను హింసిస్తున్నట్టు గుర్తించడానికి నిరాకరించే దశే ఈ ‘డీనియల్‌’.

2. గిల్టీ (అపరాధభావన) : భర్త తనను హింసించడానికి లేదా కొట్టడానికి ఒక రకంగా తాను చేసిన తప్పే అని సర్దిచెప్పుకునే ధోరణే ఈ అపరాధభావనకు కారణం.

3. ఎన్‌లైట్‌మెంట్‌ : భర్త చేతుల్లో ఇలా తరచూ హింసకు గురికావడం తమకు తగదనీ, దాన్నుంచి బయటకు రావాలనే భావన కలగడం ఈ ఎన్‌లైట్‌మెంట్‌ దశలో జరుగుతుంది.

4. రెస్పాన్సిబిలిటీ : ఈ దశలో వారు తామీ హింస నుంచి బయటపడటం అన్నది తమ చేతుల్లోనే ఉందనీ, అది తమ బాధ్యత అని గ్రహిస్తారు. అవసరమైతే బంధం నుంచి బయటపడైనా ఈ హింసనుంచి విముక్తి పొందవచ్చని అనుకునే దశ ఇది.

బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌ మొదలయ్యేదిలా...
మొదట్లో ఏదో మనస్పర్థల కారణంగా భర్త ఆగ్రహానికి గురైనప్పుడు మహిళ అంతగా ప్రతిఘటించకపోవచ్చు. ఇది పెళ్లయిన కొత్తలో ఇలా జరగడానికి అవకాశముంది. భర్త తొలుత శారీరకంగానో లేదా మానసికంగానో బాధపెట్టాక ఎందుకో అలా జరిగిపోయిందనీ, ఇకపై అలా జరగదంటూ ఎమోషనల్‌గా మాట్లాడతాడు. ఆమె ఆమోదం పొందడం కోసం అవసరమైనదానికంటే ఎక్కువ రొమాంటిక్‌గా వ్యవహరిస్తూ ఆమెను నార్మల్‌ చేయడానికి ప్రయత్నిస్తాడు.

కానీ ఈ హింస అక్కడితో ఆగకుండా అదేపనిగా మాటిమాటికీ కొనసాగుతూ ఉంటుంది. దాంతో తొలుత అతడు చెప్పే (కన్వీన్స్‌ చేసే) అంశాలకు లొంగిపోయిన మహిళ ఆ తర్వాత అదో రొటీన్‌ తంతు అని గ్రహించి, పెద్దగా స్పందించడమూ మానేస్తుంది. అలా గృహహింస వేదనలకు గురవుతూనే ఉంటుంది. ఇలా జరగడానికి ఆర్థిక సమస్యలూ, విడిపోతామేమోనన్న భయం, తనను తాను సముదాయించుకునే సర్దుబాటు ధోరణీ... ఇలాంటి కారణాలు చాలానే ఉండవచ్చు. -నిర్వహణ: యాసీన్‌

చికిత్స... ఇది వ్యక్తి నుంచి వ్యక్తికి మారుతుంది. వారు అనుభవించిన, అనుభవిస్తున్న బాధలూ లేదా వారిలో వ్యాధి తీవ్రతను బట్టి కౌన్సెలింగ్, ఇంటర్‌పర్సనల్‌ థెరపీ, అవసరాన్ని బట్టి కొన్ని యాంటీ డిప్రెసెంట్‌ మందులు వాడాల్సి ఉంటుంది. ఇక సామాజికంగా ఈ వేదననుంచి విముక్తి కావడం కోసం వారి కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషుల సంప్రదింపుల తర్వాత పోలీసులను సంప్రదించడం వంటి ప్రత్యామ్నాయాలూ అనుసరించవచ్చు.

గుర్తించడం ఎలా...
కొన్ని గుర్తుల (లక్షణాల) ఆధారంగా ఓ మహిళ బ్యాటర్‌డ్‌ ఉమన్‌ సిండ్రోమ్‌ బారిన పడిందని గుర్తించవచ్చు. అవి... తాను నలుగురిలో కలవకపోవడం... ఎందుకని అడిగినప్పుడు ఏవో సాకులు చెప్పి తప్పించుకుంటూ ఉండటం భర్త వచ్చే టైమ్‌కు చాలా తీవ్రమైన ఉద్నిగ్నానికీ, ఆందోళనకు లోనవుతుండటం

దేహంపై కనిపించే గాయాల గురించి అడిగితే ఏవేవో పొంతనలేని కారణాలు చెప్పి దాటవేయడానికి చూడటం. దుస్తులను గాయాలను దాచేలా సర్దుతుండటం. (ఉదాహరణకు మంచి వేసవిలోనూ దేహమంతా కప్పివేసే దుస్తులు ధరించడం) తన ఉద్యోగం కారణంగా వచ్చే జీతం వంటివన్నీ తన భర్త అధీనంలోనే ఉంచడం

భర్తనుంచి ఏదైనా కాల్‌ రాగానే తీవ్రమైన కలవరపాటుకు గురవుతుండటం.

ప్రభావాలు...

స్వల్పకాలిక ప్రభావాలివి...
జీవితం వృథా అనుకోవడం, తీవ్రమైన కుంగుబాటు (డిప్రెషన్‌) ఆత్మవిశ్వాసం లోపించడం (లో సెల్ఫ్‌ ఎస్టీమ్‌) తీవ్రమైన ఉద్విగ్నత (సివియర్‌ యాంగై్జటీ).

దీర్ఘకాలిక ప్రభావాలివి...
తరచూ గతకాలపు జ్ఞాపకాల్లోకి వెళ్లడం, తానేమిటో మరచిపోయి వేరేగా ప్రవర్తించడం (డిసోసియేటివ్‌ స్టేట్‌), తీవ్రంగా ప్రతిస్పందించడం (వయొలెంట్‌ ఔట్‌బరస్ట్‌... ఇది సుదీర్ఘకాలం తర్వాత వచ్చే పరిణామం) హైబీపీ, గుండెజబ్బుల వంటివి కనిపించడం, కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్‌ దీర్ఘకాలికం (క్రానిక్‌)గా వచ్చే వెన్నునొప్పి, తలనొప్పి.

  • డాక్టర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై హెచ్‌వోడీ ఆఫ్‌ సైకియాట్రీ సీనియర్‌ సైకియాట్రిస్ట్‌ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement