పాకిస్థాన్‌లోని సాంస్కృతిక వారసత్వ కట్టడాల పరిరక్షణకు అక్కడి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతుంది. ఇందులో భాగంగా అక్కడి లాహెర్‌కోట లోని శ్రీ రామచంద్రుడి కుమారుడి లోహ్ ఆలయాన్ని పునరుద్ధరించి భక్తుల సందర్శనార్థం పున:ప్రారంభించింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు తెలిపారు.
పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో లాహోర్ కోటలో చారిత్రక లోహ్ మందిరాన్ని వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA), ఆగా ఖాన్ కల్చరల్ సర్వీస్ – పాకిస్థాన్ సహకారంతో పునరుద్ధరించారు. ఈ దేవాలయం శ్రీరాముడి ఇద్దరు కుమారుల్లో ఒకరైన లవుడికి సంబంధించిందిగా భక్తులు విశ్వసిస్తారు. దీనికి 2018లో కొంతమేర మరమ్మత్తులు జరుపగా ఇప్పుడు పూర్తిస్తాయిలో పునరుద్ధరించారు.అయితే హిందూ సంప్రదాయం ప్రకారం, లాహోర్ నగరానికి లవుడి పేరు మీద ఆ పేరు వచ్చిందని ప్రజలు విశ్వసిస్తారు.
చారిత్రక లాహోర్ కోటలో కనిపించే సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు హిందూ దేవాలయాలు, సిక్కులకు చెందిన నిర్మాణాలు, మొఘల్ మసీదులు, బ్రిటిష్ కాలపు కట్టడాలు—ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇటీవల లాహెర్ కోటను పర్యవేక్షించిన ఓ సిక్కు ట్రావెలర్ సిక్కుల పాలన కాలంలో లాహోర్ కోటలో సంరక్షించబడిన సుమారు 100 చారిత్రక స్మారక కట్టడాలను గుర్తించారు.
దీంతో లాహోర్ కోటకు సిక్కు సామ్రాజ్య కాలంలో ఉన్న చారిత్రక విలువను సమగ్రంగా ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి వాల్డ్ సిటీ లాహోర్ అథారిటీ (WCLA) అమెరికాకు చెందిన సిక్కు పరిశోధకుడు డా. తరుంజీత్ సింగ్ బుటాలియాను నియమించి “Lahore Fort during the Sikh Empire” అనే పేరుతో ఒక టూర్ గైడ్ పుస్తకాన్ని రచించారు.


