ఉత్తరప్రదేశ్‌ని పొగమంచు అతలాకుతలం చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పొగమంచు తీవ్రంగా ఉండడంతో రోడ్డుపై ఏమి కనిపించక వాహనాలు ఎక్కడికక్కడ ఢీకొన్నాయి. దీంతో దాదాపు 7మంది ప్రాణాలు కోల్పోగా పెద్దఎత్తున ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది.
ఉత్తర భారతాన్ని పొగమంచు కమ్మేసింది. శీతాకాలం కావడంతో దట్టమైన పొగమంచు రోడ్లపై అలుముకుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌లోని 15 జిల్లాల్లో 40కి పైగా రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. వాహనాలు ఢీకోనడంతో వేరువేరు ప్రమాద ఘటనల్లో ఏడుగురు మృతిచెందగా 50 మందికి పైగా గాయాలైనట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో 100కు పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా జమ్మూకశ్మీర్‌లో అత్యంత కఠినమైన చలికాలం చిల్లైకలాన్ కొనసాగుతుంది. దీంతో కశ్మీర్ అంతటా ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీల్లోకి వెళ్లాయి. అత్యధికంగా షోపియాన్ ప్రాంతంలో -5.6 డిగ్రీలు, శ్రీనగర్ -4 డిగ్రీలు, గుల్మార్గ్ -4.2 డిగ్రీలు, సోనామార్గ్ -2.9, పహల్గామ్ -2.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అక్కడి అధికారులు పేర్కొన్నారు.
జమ్మూకశ్మీర్‌లో చలికాలం అత్యంత ఎక్కువగా ఉండే కాలాన్ని చిల్లైకలాన్ అంటారు. ఇది డిసెంబర్ 21న ప్రారంభమై జనవరి 30 వరకూ ఉంటుంది. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలలోకి వెళతాయి.


