
- పైలట్ ‘మాస్ మర్డర్-సూసైడ్’…
- ఎందుకీ ‘హత్యాత్మహత్యలు’?
- పైలట్ల మానసిక ఆరోగ్యం భద్రమేనా?
- ఎయిరిండియా విమానం ఇంధన ‘స్విచాఫ్’ వెనుక మర్మమేంటి?
- కాక్పిట్ కెమెరాలు పెట్టాల్సిందేనా?
టేకాఫ్ చేసిన కొద్ది సెకండ్లలో ఎయిరిండియా బోయింగ్ 787 విమానంలోని ఇంధన నియంత్రణ మీటల్ని కెప్టెన్ (సీనియర్ పైలట్) సుమీత్ సబర్వాల్ ఎందుకు ఆపేశాడు? ఒక్క సెకను తేడాతో రెండు స్విచ్చులు ఆఫ్ అయ్యాయి. ఫలితంగా విమానం ఇంజిన్లకు ఇంధన సరఫరా నిలిచిపోయింది. పైలట్స్ తేరుకుని మీటల్ని లాగి ఇంధన సరఫరాను పునరిద్ధరించేందుకు యత్నించినా అప్పటికే సమయం మించిపోయింది. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.
ఇంధనం అందక, చోదక శక్తి క్షీణించి విమానం కుప్పకూలింది. గత నెల 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన వెంటనే సంభవించిన ఈ దుర్ఘటనలో ఒకే ఒక్క ప్రయాణికుడు మినహా మిగతా 241 మందీ దుర్మరణం పాలయ్యారు. ఈ 241 చావుల్లో ఒకదాన్ని (కెప్టెన్/సీనియర్ పైలట్) ఆత్మహత్యగా, మిగతా 240 మరణాలను హత్యలుగా (మాస్ మర్డర్-సూసైడ్) భావించాలా? వీరే కాకుండా విమానం కూలిపోయాక భూమిపై ఉన్న మరో 19 మంది చనిపోయారు.

మొత్తం మరణాలు దాదాపు 260. ఇంతకూ ఇది పైలట్ ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్కృత్యమా? పరధ్యానమా? లేక ప్రమాదమా? విద్రోహ చర్యా? ఏమో... ఇంకా తెలియరాలేదు. కారణాల వెలికితీత కోసం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారం పైలట్ల మానసిక ఆరోగ్యంపైనా చర్చను లేవదీస్తోంది.
పైలట్లే కూల్చేశారు!
విమాన దుర్ఘటనల్లో పైలట్ ‘హత్యాత్మహత్యల’ ఉదంతాలు అరుదు అయినప్పటికీ చరిత్రలో అవి కూడా లేకపోలేదు. 2015లో ‘జర్మన్ వింగ్స్’ కో-పైలట్ ఆండ్రియాస్ లుబిడ్జ్ తన కెప్టెన్ (సీనియర్ పైలట్)ను కాక్పిట్ వెలుపల బంధించి ఎ320 ఎయిర్ బస్ విమానంతో నేరుగా ఫ్రెంచ్ ఆల్ప్స్ పర్వతాలను ఢీకొట్టాడు. దాంతో విమానంలోని మొత్తం 150 మందీ చనిపోయారు. ఇక 1997లో ‘సిల్క్ ఎయిర్’ ఫ్లైట్ 185, 1999లో ‘ఈజిప్ట్ ఎయిర్’ ఫ్లైట్ 990 విమాన ప్రమాదాలకు పైలట్ల ఉద్దేశపూర్వక చర్యలే కారణమని అమెరికా ఇన్వెస్టిగేటర్లు నిర్ధారించారు.
ఈ రెండు ఘటనల్లో 321 మంది చనిపోయారు. అయితే ఆ రెండు దుర్ఘటనలకు దారితీసిన కారణాలపై అమెరికన్ ఇన్వెస్టిగేటర్లు కనుగొన్న అంశాలతో ఇండోనేషియా, ఈజిప్ట్ విభేదించండం వేరే సంగతి. ఇక ఇటీవల 2022లో చైనా ఈస్టర్న్ ఫ్లైట్ 5735 కూడా తాను ప్రయాణిస్తున్న ఎత్తు నుంచి వేగంగా కిందికి దిగిపోయి కూలిపోవడంతో 132 మంది మరణించారు. అది కూడా పైలట్ ఉద్దేశపూర్వక చర్యేనని లీకైన డేటా సూచిస్తోంది. హిందూమహాసముద్ర గగనతలంపై ప్రయాణిస్తూ 2014లో మలేషియా ఎయిర్లైన్స్ 370 విమానం అదృశ్యమైంది. అందుకు కారణాలు ఇప్పటివరకు తెలియలేదు.
విమానం కెప్టెన్ జహారీ అహ్మద్ షా ‘హత్యాత్మహత్యల’ (ఉద్దేశపూర్వక) చర్య ఫలితంగానే ఈ దుర్ఘటన సంభవించిందన్న వాదనలు కొన్ని తెరపైకి వచ్చాయి. స్విస్ ‘బ్యూరో ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్స్ ఆర్కైవ్’ సమాచారాన్ని విశ్లేషించి ‘న్యూస్ వీక్’ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం... గత 30 ఏళ్లలో ఇలాంటి ఉద్దేశపూర్వక హత్యాత్మహత్యల వల్ల 1,034 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైన విమానాల ప్రమాదాల్లో అదే గత 30 ఏళ్ల వ్యవధిలో చనిపోయిన వారి సంఖ్యతో పోలిస్తే... ఈ పైలట్ ‘మర్డర్-సూసైడ్’ మరణాల సంఖ్య 3.5 శాతంగా ఉన్నట్టు తేలింది.

ఇలాంటి సంఘటనలు అరుదే అయినప్పటికీ విమానయాన భద్రతలో పైలట్ల మానసిక ఆరోగ్యానికి ఎంతటి ప్రముఖ పాత్ర ఉందో అవి తేటతెల్లం చేస్తున్నాయని ‘సెంటర్ ఫర్ ఏవియేషన్ సైకాలజీ’ క్లినికల్ సైకాలజిస్టు డాక్టర్ రాబర్ట్ బోర్ వ్యాఖ్యానించారు. మొత్తం విమాన ప్రమాదాల్లో ఈ ‘ఉద్దేశపూర్వక’ ఘటనల భాగం స్వల్పమే అయినప్పటికీ వాటిల్లే నష్టం మాత్రం అపారం. ఎందుకంటే వాటివల్ల కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయి. విమానయానంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. పైలట్ల మానసిక ఆరోగ్యం పట్ల వైమానిక రంగ పర్యవేక్షణా లోపాల్ని అవి ఎండగడతాయి. పైలట్లు అత్యంత అప్రమత్తంగా మెలగాలని కోరుకుంటామని, అయితే వారు ఎదుర్కొంటున్న సమస్యలు సాంకేతికపరమైనవి మాత్రమే కాదని, అందులో వ్యక్తిగత, ఆర్థిక, సంబంధాలపరమైన అంశాలు కూడా ఉన్నాయని రాబర్ట్ బోర్ చెప్పారు. పైలట్లు ఎదుర్కొంటున్న ఇటువంటి ఒత్తిళ్లను పట్టించుకోకుండా, పరిష్కరించకుండా అలాగే ఉపేక్షిస్తే అవి ప్రమాదకరంగా మారతాయని అన్నారు.
తాము మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు పైలట్స్ ఎవరైనా బయటికి చెబితే వారి కెరీర్ రిస్కులో పడుతుందని, పైలట్ లైసెన్స్ కోల్పోయే అవకాశముందని, ఆ భయంతో వారెవరూ ముందుకురారని వైమానిక నిపుణుడు, మాజీ పైలట్ డాన్ బబ్ చెప్పారు. పైలట్ ‘మర్డర్-సూసైడ్’ ఘటనల నివారణకు వీలుగా విమానం కాక్పిట్లో పైలట్లపై నిఘా కోసం వీడియో కెమెరాలు పెట్టాలని అమెరికాలోని జాతీయ రవాణా భద్రతా మండలి 2000 సంవత్సరంలో సూచించింది. తమ గోప్యతకు భంగం వాటిల్లుతుందని పైలట్లు అభ్యంతరం చెబుతుండటంతో కాక్పిట్లో వీడియో రికార్డింగుపై చర్చ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇంజిన్లకు ఇంధనం సరఫరా ఎందుకు ఆపివేశావంటూ ఎయిరిండియా బోయింగ్ 787 విమానం సీనియర్ పైలట్ ను కో-పైలట్ అడిగినట్టు కాక్పిట్ వాయిస్ రికార్డర్ (సీవీఆర్) వెల్లడించడం చూస్తుంటే... పైలట్ల మానసిక ఆరోగ్యం విషయంలో వైమానిక పరిశ్రమ వ్యవహరిస్తున్న తీరుపై ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
- జమ్ముల శ్రీకాంత్