అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

Feb 14 2026 10:17 AM | Updated on Feb 14 2026 10:17 AM

అత్త

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య ప్రమాదవశాత్తూ కాలువలో పడి మహిళ మృతి గుర్తుతెలియని మృతదేహం లభ్యం కోడి పుంజుల స్వాధీనం

ముదినేపల్లి రూరల్‌: అత్త వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దేవపూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గురిండి గ్రామానికి చెందిన సింధుపురం సంతోషిని(27) దేవపూడికి చెందిన చేడు మహేష్‌ను ప్రేమించి 2023లో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సంతోషిని బంధువులు అంగీకరించినప్పటికీ మహేష్‌ తల్లి ఒప్పుకోలేదు. అయినప్పటికీ వీరిరువురు వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉండగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. దీంతో అత్త అప్పలనరసమ్మ తరచూ కోడలైన సంతోషిని అనారోగ్యవంతురాలైన కూతురిని కన్నావంటూ వేధిస్తోంది. అయితే ఇటీవల మళ్లీ సంతోషిని గర్భం దాల్చింది. అయినప్పటికీ అత్త వేధింపులు ఆపకపోవడంతో పడక గదిలో ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి సంతోషిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సంతోషిని సోదరుడు సింగుపురం శేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వీరభద్రరావు గుడివాడ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆకివీడు: స్థానిక శ్రీరామ్‌పురంలో నివసిస్తున్న రాజనాల మంగతాయారు(48) ప్రమాదవశాత్తూ శుక్రవారం కాలువలో పడి మృతి చెందింది. గత కొంతకాలంగా ఆమె మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. కాలువలో నీళ్లు తీసుకువచ్చేందుకు వెళ్లగా ఫిట్స్‌ రావడంతో కాలువలో పడి మునిగిపోయింది. స్థానికులు వెంటనే గమనించి ఆమెను రక్షించే ప్రయత్నం చేయగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు.

పనుగొండ: వశిష్టా గోదావరిలో దొంగరావిపాలెం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు పెనుగొండ ఎస్సై కె.గంగాధర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గురువారం సాయంత్రం దొంగరావిపాలెం ఇన్‌చార్జి వీఆర్‌ఓ వంకా వెంకటేశ్వరరావు ఇచ్చిన సమాచారం మేరకు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. మృతుడు 35–45 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఉండి: మండలంలోని ఆరేడులో చోరీకి గురైన కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణపవరం గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి రవితేజ రొయ్యల చెరువుల గట్లపై పెంచుతున్న కోళ్లను బుధవారం రాత్రి చోరీ చేసిన ఘటన పాఠకులకు విధితమే. గురువారం సాయంత్రం ఆ కోళ్లను ఆటోలో తరలిస్తున్న వీరవాసరం మండలం వడ్డిగూడేనికి చెందిన సైదు మోహన్‌రావును ఎన్నార్పీ అగ్రహారం వద్ద పోలీసులు అరెస్టు చేసి, కోళ్లను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్‌ చేశారు. శుక్రవారం నిందితుడిని రిమాండ్‌ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు.

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య 1
1/1

అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement