కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా | - | Sakshi
Sakshi News home page

కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా

Feb 17 2026 7:15 AM | Updated on Feb 17 2026 7:15 AM

కరుణి

కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా

పెద్దింట్లమ్మ సేవ చేయడం అదృష్టం

ఈనెల 18 నుంచి అమ్మవారి జాతర

వేంగి చాళుక్యుల కాలం నుంచి పెద్దింట్లమ్మకు పూజలు

తెలంగాణ బోనాల తరహాలో మొక్కులు

కైకలూరు: కొల్లేటి మహాపట్టమహిషి పెద్దింట్లమ్మ జాతర ద్వీపకల్పమైన కొల్లేరు సరస్సు మధ్యన అంగరంగ వైభవంగా జరగనుంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఏలూరు జిల్లా, కైకలూరు మండలం కొల్లేటి కోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 3 వరకు అమ్మవారి జాతర (తీర్థం) నిర్వహిస్తున్నారు. జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరుల కల్యాణం ఈనెల 28 శనివారం రాత్రి జరుగుతుంది.

కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి 9 అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. కాలాలతో పాటు కోటలు మాయమైనప్పటికీ పెద్దింట్లమ్మ తల్లి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సామాన్యంగా ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది. కానీ పెద్దింట్లమ్మను ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివ సించేవారందరూ కులదైవంగా ఆరాధిస్తారు.

కొల్లేరుకు తెలంగాణ బోనాల సంప్రదాయం

తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ.. పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలు ప్రతి ఏటా తీసుకొస్తున్నారు. బోనాలు, 7 కావిళ్లలో అమ్మవారి పుట్టించి నైవేద్యం పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లుతో పెద్దింట్లమ్మ దేవస్థానం తీసుకువస్తారు. 3 మైళ్ల దూరంలోని గోకర్ణేశ్వరపురంలో గోకర్ణేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారితో అంగరంగ వైభవంగా కల్యాణం జరిపిస్తారు. జాతరలో కొల్లేరు భక్తజన సంద్రంగా మారిపోతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు.

ప్రయాణం సులభతరం

పూర్వం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరకు వెళ్లాలంటే ప్రయాణం కష్టతరంగా ఉండేది. అటువంటిది ఆలపాడు నుంచి అమ్మవారి దేవస్థాఽనం 7 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మతులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో నూతన రోడ్డు ఏర్పాటు చేశారు. దేవస్థానం ఎదురుగా దాతల సాయంతో శివపార్వతుల విగ్రహాం ఏర్పాటు చేశారు. వైఎస్సార్‌సీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్‌) దాతల సాయంతో నిర్మించిన అతిపెద్ద అనివేటి మండపం ఆకర్షణీయంగా మారింది. చలువ పందిర్లు, భక్తులకు కావల్సిన అన్ని వసతులు సిద్ధం చేశారు.

కొల్లేటికోట పెద్దింట్లమ్మ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి దేవాలయం వరకు ప్రభుత్వం సీసీ రోడ్లు ఏర్పాటు చేసింది. భక్తులకు జల్లు స్నానాలు, చలువ పందిర్లు, వంట ప్రాంగణాలు, కోనేరులో నీరు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాం. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరుని కల్యాణం ఈ నెల 28న జరుగుతుంది. భక్తులు అమ్మను దర్శించుకోవాలి.

– కూచిపూడి శ్రీనివాసు,

పెద్దింట్లమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి, కొల్లేటికోట

కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా1
1/2

కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా

కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా2
2/2

కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement