ఆక్వా ఆశలపై నీళ్లు చల్లి..
రొయ్య రైతులను ఆదుకోవాలి
విద్యుత్ సబ్సిడీ ఇవ్వాలి
ఆకివీడు ఆక్వా రంగానికి బడ్జెట్‌లో అరకొర మాత్రమే నిధులు కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆక్వా రంగం అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రొయ్యల ఎగుమతుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డాలర్ల రూపంలో వందల కోట్ల రూపాయాల్ని ఆదాయంగా గడిస్తున్నా, ఆ రంగానికి తగిన ప్రాతినిధ్యం, నిధుల కేటాయింపు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి సైతం బడ్జెట్‌లో ఏ విధమైన నిధులూ కేటాయించలేదు. నర్సాపురం తీరంలో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి మాత్రం మొక్కుబడిగా రూ. 20 కోట్లు కేటాయించారు. విపత్తులు, ధరలు పడిపోయినప్పుడు, తెగుళ్ల బెడదతో మూకుమ్మడిగా పట్టుబడులు పట్టిన సమయంలో రైతులు రొయ్యలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్‌ల ఏర్పాటుకు బడ్జెట్‌లో స్థానం లేకపోయింది.
విద్యుత్ రాయితీ గాలికే
ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్. అప్సడాలో నమోదు కాకుండా ఉన్న చెరువులకు కూడా విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నరకు ఇస్తానని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం అప్సడా అంటూనే డప్పుకొడుతోందని రొయ్య రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆక్వా రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఇదే సమస్యపై రైతులు ఆందోళన చేస్తే చంద్రబాబు పాలనలోని ప్రజాప్రతినిధులు నీళ్లు చల్లి ఉద్యమాన్ని నీరుగార్చారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు.
పేరుకే రూ.1.50 విద్యుత్
ఆక్వా రైతులు మళ్లీ మోసానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ ధర రూ.1.50 పేరుకేనని, బిల్లు వచ్చే సరికి మూడు రూపాయల వరకూ పడుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. పది ఎకరాల లోపు రైతులకు, అప్పడాలో నమోదు కాని రైతులకు, నాన్‌జోన్‌లోని రైతులకు యూనిట్ ధర రూ.4.25 పైగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాలర్ల పంట పండించే రొయ్యల సాగును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
మళ్లీ పెరిగిన మేత ధర.. తగ్గిన రొయ్య ధర
రొయ్యల మేత ధరల్ని మళ్లీ పెంచివేశారని రైతులు వాపోతున్నారు. ఇటీవల రైతులు ఉద్యమించడంతో మేత తయారీ యజమానులు దిగివచ్చి రూ.4 తగ్గించారు. అయితే ప్రస్తుతం రొయ్యల మేత భారీగా పెంచివేశారని ఆవేదన చెందుతున్నారు. రొయ్యల చెరువుల్లో పెంపకం తగ్గిపోతే ధర స్వల్పంగా పెంచుతున్నారని, చెరువుల్లో నిండుగా రొయ్యల పెంపకం, తెగుళ్లు వచ్చిన సమయంలో ధర పతనమైపోతుందంటున్నారు. ఈ విధానంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆక్వా జోన్ల వారీగా విద్యుత్ బిల్లుల వివరాలు
ఆక్వా జోన్ మొత్తం రైతులు సబ్సిడీ కలిగిన వారు నాన్‌జోన్
భీమవరం జోన్‌న్ 9,929 8,278 1,651
నర్సాపురం జోన్ 4,314 3,993 321
తాడేపల్లిగూడెం జోన్ 2,099 1,979 120
అధిక ఆదాయాన్ని ప్రభుత్వాలకు సమకూర్చే రొయ్యల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి దృష్టి పెట్టాలి. ప్రపంచ దేశాల్లో మార్కెట్ సౌకర్యం, అధిక ధరలు లభించే విధంగా కృషి చేయాలి. స్థానికంగా విద్యుత్ సబ్సిడీలు, మేతలు, మందుల సబ్సిడీల సౌకర్యం కల్పించాలి. రైతులు సాగులో ఆటుపోటులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నంద్యాల లక్ష్మీ సీతారామయ్య,
అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ ఆకివీడు మండల కమిటీ, కుప్పనపూడి
ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం ప్రకారం రొయ్య రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ కల్పించాలి. ఆక్వా జోన్ల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. విద్యుత్ సబ్సిడీ కల్పిస్తే తెగుళ్లతో నష్టపోయిన రైతుకు కొంత ఉపశమనం దొరుకుతుంది. రూ.1.50 పైసల సబ్సిడీతోపాటు, ట్రాన్స్‌ఫార్మర్ల సబ్సిడీలు, అదనపు ఛార్జీల వడ్డన వంటివి తొలగించాలి.
– పీవీఆర్‌కే ఆంజనేయరాజు, వైఎస్సార్‌సీపీ ఉండి మండల అధ్యక్షుడు, వాండ్రం
బడ్జెట్‌లో ఆక్వాకు అరకొర కేటాయింపులు
ఆక్వా యూనివర్సిటీకి మొక్కుబడిగా నిధులు
విద్యుత్ రాయితీలపై ఊసెత్తని వైనం
ధరల స్థిరీకరణ నిధులూ అటకెక్కినట్లే
ఆక్వా ఆశలపై నీళ్లు చల్లి..
ఆక్వా ఆశలపై నీళ్లు చల్లి..
ఆక్వా ఆశలపై నీళ్లు చల్లి..


