ఆల్బెండజోల్‌తో నులిమేద్దాం!
యలమంచిలి: నులి పురుగులు చిన్నారుల్లో రక్తహీనతకు దారితీస్తాయి. కడుపులో చేరి నొప్పి, మంట, వికారం కలుగుజేస్తాయి. దీనివల్ల ఆకలి ఉండదు. పిల్లలు నీరసపడతారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు ప్రబలుతాయి. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారిలో ప్రధానంగా నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 3,51,125 మంది ఉన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వీరికి ఈనెల 17 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
పాటించాల్సిన జాగ్రత్తలు
● అపరిశుభ్రత వల్ల నులి పురుగుల సమస్య తలెత్తుతుంది. కావున చిన్నారులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి.
● చేతి గోళ్లలో పేరుకున్న మట్టి వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పెరిగిన గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.
● మల విసర్జన తరువాత, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కాళ్లకు చెప్పులు ధరించాలి.
● శుభ్రమైన నీటిని తాగాలి, పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగాక మాత్రమే వినియోగించాలి.
చిన్నారుల జీవితాన్ని నులి పురుగులు
నులి మేస్తున్నాయి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి నులి పురుగులను కేవలం ఒకే మాత్ర ఆల్బెండజోల్‌తో నులిమేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 19 ఏళ్ల లోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ఈ నెల 17న ప్రారంభమవుతుంది.


