విద్యాంజలి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలోని 1,728 పాఠశాలలు విద్యాంజలి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పాఠశాలలకు కావాల్సిన అవసరాలను విద్యాంజలి పోర్టల్‌లో నమోదు చేయాలని సమగ్రశిక్ష జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్ సూచించారు. గురువారం స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి విద్యాంజలి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాలలకు అవసరమైన సదుపాయాలను సర్వీస్ రూపంలో, వస్తు రూపంలో అవసరాలుగా నమోదు చేయాలని సూచించారు. విద్యాంజలి కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాలకు అవసరమైన సదుపాయాలు దాతల ద్వారా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యాంజలి పోర్టల్ ద్వారా వాలంటీర్‌గా పాఠశాలల్లో సర్వీస్ చేయడానికి ఆసక్తి ఉన్న వ్యక్తులను ప్రోత్సహించి రిజిస్ట్రేషన్ చేసేటట్టు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. విద్యాంజలి కార్యక్రమంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 7వ తేదీన జిల్లాలోని అన్ని మండలాల్లో ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహించాలని, వాటికి అవసరమైన నిధులు విడుదల చేసినట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులు, ఎన్‌న్‌జీవోలు, ఎస్‌ఎంసీ సభ్యులు, రిసోర్స్ పర్సన్‌లకు శిక్షణ ఇచ్చారు. అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ రెడ్డి రామారావు, కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ యెహోషువ, ఆల్టర్నేటివ్ స్కూల్ కోఆర్డినేటర్ ఎస్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


