పక్కా ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి నిల్
సిబ్బంది కొరత ఉన్నా పనిచేస్తున్నాం
● గృహ నిర్మాణశాఖను వేధిస్తున్న సిబ్బంది కొరత
● ఏఈలు, డీఈలు లేరు
● అన్ని పనులు ఈఈనే చేసుకోవాలి
నూజివీడు: రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజివీడు నియోజకవర్గంలో గృహ నిర్మాణ శాఖను సిబ్బంది కొరత వేధిస్తోంది. వర్క్ ఇన్‌స్పెక్టర్ల నుంచి ఏఈ, డీఈల వరకు సిబ్బంది కొరతతో ఆశాఖ ఉన్నతాధికారైన ఈఈ సతమతమవుతోన్నారు. గృహ లబ్ధిదారులతో సమావేశం ఏర్పాటు చేయాలంటే లబ్ధిదారులకు తానే సమాచారం ఇచ్చి వారిని రప్పించి సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారు. నూజివీడు డివిజన్‌లో నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, లింగపాలెం, చింతలపూడి మండలాలతో పాటు నూజివీడు మున్సిపాలిటీ, చింతలపూడి నగర పంచాయతీలున్నాయి. ఈ మండలాల్లో జగనన్న కాలనీల్లో గృహాలు త్వరితగతిన నిర్మాణం జరిగేలా చూసుకోవాల్సిన బాధ్యత వర్క్ ఇన్‌స్పెక్టర్లు, ఏఈలపై ఉంది. అయితే 8 ఏఈ పోస్టులు ఖాళీగా ఉండటంతో గ్రామ, వార్డు సచివాలయాలకు చెందిన ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లను ఇన్‌చార్జి ఏఈలుగా నియమించి కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లు వారి రెగ్యులర్ వర్కులకు, సర్వేలు చేసేందుకు ప్రాధాన్యతనిస్తుండటం, గృహ నిర్మాణ శాఖ పనులనుపై పెద్దగా దృష్టి సారించకపోవడంతో గృహాల నిర్మాణం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా పరిస్థితి నెలకొంది. అంతేగాకుండా పలు వార్డు, గ్రామ సచివాలయాల్లో సైతం ఇంజినీరింగ్ అసిస్టెంట్‌ల కొరత నెలకొంది. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించి బేస్‌మెంట్ లెవెల్ నుంచి రూఫ్ లెవెల్ వరకు పలు స్థాయిల్లో ఉన్న గృహాల నిర్మాణాలను మార్చి నెలాఖరు వరకు పూర్తిచేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయాలంటే సిబ్బంది లేక ఉన్నతాధికారులు సతమతమవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం ఎలా చేయాలా అని కూడా తలలు పట్టుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి.
పట్టణంలో విఽవిధ దశల్లో 957 గృహాలు
నూజివీడు పట్టణ పరిధిలో 12 జగనన్న కాలనీ లేఅవుట్‌లుండగా 2,737 గృహాలను మంజూరు చేయగా వాటిలో 1,401 గృహాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. మిగిలిన వాటిలో 341 గృహాలకు అసలు నిర్మాణ పనులు ప్రారంభించలేదు. బేస్‌మెంట్ లెవెల్‌లో 828 గృహాలు, రూఫ్ లెవెల్‌లో 129 గృహాలు చొప్పున మొత్తం 957 గృహాల నిర్మాణ పనులను మార్చి నెలాఖరు కల్లా పూర్తిచేయాల్సి ఉంది. దీనికి గాను ఆయా లబ్ధిదారులతో సమావేశాలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల్లో చైతన్యం తీసుకువచ్చి నిర్మాణం జరుపుకునేలా చేయాల్సి ఉంది. అయితే క్షేత్రస్థాయిలో సిబ్బంది కొరత వేధిస్తుండటంతో పనులు ఏమీ జరగడం లేదు. ఈఈ ఒక్కరే లబ్ధిదారులకు సమాచారం ఇవ్వడం, సమావేశాన్ని ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించి గృహాలను నిర్మించుకునేలా చైతన్యపరచడం, ఉన్నతాధికారులు నిర్వహించే టెలీ కాన్ఫరెన్స్‌లు, సమావేశాలకు హాజరవ్వడం వంటి పనులతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రెగ్యులర్ సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
డివిజన్‌లో సిబ్బంది కొరత ఉన్నప్పటికీ ప్రభుత్వ లక్ష్యాల మేరకు పనిచేస్తున్నాం. వచ్చే నెలాఖరు నాటికి పట్టణంలో 957 గృహాల నిర్మాణాన్ని పూర్తిచేయాలని లబ్ధిదారులను చైతన్య పరుస్తున్నాం. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు ప్రభుత్వం అదనంగా అందిస్తున్న సాయాన్ని సైతం తెలియజేసి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.
– మూడు రామోజీ నాయక్, హౌసింగ్ ఈఈ, నూజివీడు
పక్కా ఇళ్ల నిర్మాణాల్లో పురోగతి నిల్


