మోగనున్న పెళ్లి బాజాలు | - | Sakshi
Sakshi News home page

మోగనున్న పెళ్లి బాజాలు

Feb 6 2026 7:17 AM | Updated on Feb 6 2026 7:17 AM

మోగను

మోగనున్న పెళ్లి బాజాలు

ఈ ఏడాది వేల సంఖ్యలో వివాహాలు

తణుకు అర్బన్‌: మూడుముళ్లతో ఏడడగులు నడుస్తూ అగ్ని సాక్షిగా వేదమంత్రోచ్ఛరణతో ఏర్పడే వివాహ బంధం కోసం ముహుర్తాలు ముంచుకొచ్చే వేళ దగ్గరపడింది. నిండు నూరేళ్లు విడదీయలేని జన్మజన్మల బంధాన్ని కలిపే మంచి ముహూర్తం కోసం వధూవరులు ఉవ్విళ్లూరుతున్నారు.

ముహూర్తాల జాతర

మూఢం అనంతరం వివాహాల వేడుకకు పండితులు ముహుర్తాలు సిద్ధం చేశారు. గత నాలుగు నెలలుగా ముహూర్తాలు లేకపోవడంతో కల్యాణాలు పెండింగ్‌లో పడ్డాయి. ఈనెల 17వ తేదీతో మూఢం ముగుస్తుండడంతోపాటు 2026 ఏడాది పొడవునా ముహూర్తాల జాతర ఉన్న నేపథ్యంలో వేల సంఖ్యలో వివాహాలు జరిగే పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాల కోసం వధూవరుల పెద్దలు వెతుకులాట చేపట్టారు. భారీ స్థాయిలో ముహుర్తాలు ఉన్న సందర్భంగా ఆలయాలు, కల్యాణ మండపాలు బుకింగ్‌ చేసుకుంటున్నారు. ముహూర్తం ఫిక్స్‌ అవ్వకపోయినా ముందస్తుగానే కల్యాణ మండపాలకు సిఫార్సులతో బుకింగ్‌లు చేసేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సీజన్‌లో సుమారుగా మూడు వేలకు పైగా వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు.

ఈనెల 20 నుంచి కల్యాణ వైభోగం

ఈ ఏడాదిలో ఫిబ్రవరి నెలలో ముహూర్తాలు ప్రారంభం కానున్నాయి. ఏడాది పొడవునా శుభ ముహూర్తాలు ఉండడంతోపాటు ముఖ్యంగా ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో అధిక సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 20, 21, 24, 25, 26 తేదీల్లోను, మార్చిలో 1, 3, 4, 7, 8, 9, 11, 12 తేదీల్లోను, ఏప్రిల్‌లో 15, 20, 21, 25, 26,27, 28, 29 తేదీల్లోను, మే లో 1, 3, 7, 11 తేదీల్లోను, జూన్‌లో 21, 22, 23, 24, 25, 26, 27, 29, తేదీల్లోను, జూలైలో 1, 6, 7, 11 తేదీల్లోను, నవంబరులో 21, 24, 25, 26, 27, 30 తేదీల్లోను, డిసెంబరులో 1, 2, 3, 4, 6, 11, 12, 13 తేదీల్లో అధిక సంఖ్యలో పెళ్లిళ్లు ఉండనున్నాయి.

కల్యాణ మండపాలకు డిమాండ్‌

రానున్న శుభ ముహూర్తాలకు కల్యాణ మండపాలు, హోటళ్లకు డిమాండ్‌ నెలకొంది. జిల్లాలో వందకుపైగా ఉన్న కల్యాణ మండపాల్లో భారీగా వివాహాలు జరిగేందుకు సిద్ధంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే కల్యాణ మండపాలు ముందస్తు బుకింగ్‌లు అయిపోయాయి. మండపం స్థాయిని బట్టి రూ.50 వేలు నుంచి రూ.5 లక్షల వరకు పలుకుతున్నట్లుగా తెలుస్తోంది.

గిరాకీగా అనుబంధ వ్యాపారాలు

పెళ్లిళ్ల కోసం జిల్లాకు వచ్చే బంధువులు, అతిథుల కోసం లాడ్జీలు, హోటళ్లు సైతం ముహుర్తాలున్న తేదీల్లో బుక్‌ అవుతున్నాయి. ఇక పెళ్లిళ్లకు అత్యంత ముఖ్యమైనది డెకరేషన్‌. వీటిలో ఫ్లవర్‌ డెకరేషన్‌కు రూ.30 వేలు నుంచి రూ.5 లక్షల వరకు ధరలు పలుకుతుండగా, జిల్లాలో తూర్పుగోదావరి జిల్లా, కడియం ప్రాంతంతోపాటు చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి సైతం తాజా పూల రకాలను తెప్పిస్తారు. సినీ హంగులతో భారీ సెట్టింగ్‌లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా మూఢం కారణంగా గిరాకీ లేకుండా ఖాళీగా ఉన్న ఫొటోగ్రాఫర్లకు డిమాండ్‌ పెరగనుంది. వీడియో గ్రాఫర్స్‌, మిక్సింగ్‌ యూనిట్స్‌ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. సుమారుగా రూ.50 వేలు నుంచి లక్షల్లో బేరాలు జరుగుతున్నాయి.

పురోహితులకు క్రేజ్‌

వివాహాల ముహూర్తాలు దగ్గరపడడంతో పురోహితులు కూడా ముందస్తుగానే బుక్‌ అయిపోతున్నారు. వారికి కూడా విపరీతమైన డిమాండ్‌ నెలకొంది. అలాగే మంగళ వాయిద్యాలు వాయించే భజంత్రీలు, ఆర్కెస్ట్రాలు, ట్రావెల్స్‌కు సైతం కార్లు, బస్సుల కోసం ముందస్తుగానే రిజర్వేషన్‌లు చేసుకుంటున్నారు. షామియానా వ్యాపారాలు కూడా ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా క్యాటరింగ్‌ సంస్థలు బిజీగా ఉండనున్నాయి. క్యాటరింగ్‌ కార్మికులకు డిమాండ్‌ పెరిగింది.

మూఢం కారణంగా గత నాలుగు నెలలుగా పెళ్లి ముహుర్తాలు లేవు. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మొదలవుతున్న ముహుర్తాలు ఏడాది పొడవునా ఉన్నాయి. ఈ ఏడాది ప్రతి మాసంలోనూ ముహుర్తాలు ఉండడంతోపాటు భారీ ముహుర్తాలు ఉండడంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు సంబరంలా జరుగుతాయి. వివాహాలకు అనుబంధంగా ఉండే వ్యాపారాలు ఆశాజనకంగా ఉండే పరిస్థితి ఉంది.

– తంగిరాల ప్రదీప్‌ సిద్ధాంతి, శ్రీపంచముఖి హనుమద్‌ పీఠం, ఇరగవరం

ఈనెల 20 నుంచి ముహూర్తాలు

ఏడాది పొడవునా ముహూర్తాల జాతర

వేల సంఖ్యలో జరగనున్న కల్యాణాలు

పెళ్లి మండపాలకు, ఫొటోగ్రాఫర్లకు, పురోహితులకు గిరాకీ

మోగనున్న పెళ్లి బాజాలు 1
1/2

మోగనున్న పెళ్లి బాజాలు

మోగనున్న పెళ్లి బాజాలు 2
2/2

మోగనున్న పెళ్లి బాజాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement