జింకు లోపం.. రైతులకు శాపం
● పసుపు, ఎరుపు రంగుల్లో వరి ఆకులు
● లబోదిబోమంటున్న రైతులు
ఆకివీడు: రబీ సాగులో జింక్ లోపం అధికంగా కనిపిస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వివిధ గ్రామాల్లోని వరి నాట్లు వేసిన కొద్ది రోజులకే మొక్కలు లేత ఆకుపచ్చ రంగులోకి వచ్చి, తుప్పు మచ్చలు కలిగి ఉంటున్నాయని వాపోతున్నారు. జింకు లోపాల లక్షణాలు, నివారణ చర్యలను ఆకివీడు ఏడీఏ ప్రతాప్ జీవన్ వివరించారు. నీటిలో సెలనిటీ ప్రభావం, వాతావరణ ప్రభావం వంటి వాటిద్వారా జింక్‌ధాతులోపం ఏర్పడుతుందన్నారు. జింక్ లోపానికి రైతులు ఇష్టానుసారం మందులు పిచికారీ చేయడం వల్ల ఇతర నష్టాలకు గురికావలసి వస్తుందంటున్నారు. రబీ సాగు అనంతరం వరి చేలల్లో జీలుగ సాగు చేసి, పచ్చిరొట్ట దుక్కిదున్నడం, దమ్ములో కలియదున్నడంతో భూమికి పోషకాలు అందుతాయని తెలిపారు. భూమిలో అనేక థాతువులు పుట్టుకువచ్చి వరి మొక్కకు రోగనిరోధక శక్తిని పెంచుతాయన్నారు. ఈ విధంగా రైతులు పచ్చిరొట్ట సాగు చేయకపోవడంతో వరికి అనేక రకాల తెగుళ్లు వ్యాప్తి చెందుతున్నాయని, దీంతో రైతుల అధిక పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
జింక్ లోపం లక్షణాలు
జింకులోపం కలిగిన మొక్కలపై లేత పసుపు రంగు కలిగిన ఆకులు, లోపల ముదురాకు రంగులుంటాయి. తుప్ప(ఎర్ర) మచ్చలుంటాయి.
ఆకులు చిన్నవిగా, పెలుసుగా ఉండి విరిగిపోతాయి. మొక్క గిడసబారిపోతుంది.
దుబ్బులు చేయకుండా ఉంటాయి.
ఈ లక్షణాలున్న చేలల్లో కాంప్లెక్స్ ఎరువులు, నత్రజని ఎరువులు వాడినా ఫలితం ఉండదు.
నివారణ చర్యలు
జింకులోప నివారణకు కొద్ది రోజులు కాంప్లెక్స్, నత్రజని ఎరువుల వాడకాన్ని ఆపాలి.
జింక్ 12 శాతం కలిగిన ఈడీటీఏ ఒకలీటరు నీటికి 2 గ్రాములు కలిపి, 200 లీటర్ల మందు ద్రావణాన్ని 5 నుంచి 7 రోజుల వ్యవధిలో మూడు పర్యాయాలు చల్లాలి.
జింక్ స్ప్రేయింగ్ చేసే సమయంలో మొక్క బాగా తడిసే విధంగా చర్యలు చేపట్టాలి.
నీరు పలచగా ఉండే విధంగానూ, పొలాన్ని ఆరబెట్టాలి.
జింకు లోపం.. రైతులకు శాపం
జింకు లోపం.. రైతులకు శాపం


