సాగునీటి చెరువుల్లో మట్టి అక్రమ రవాణా
కొయ్యలగూడెం: యర్రంపేట–రాజవరం గ్రామాల మధ్య ఉన్న పులపాకుల చెరువు నుంచి బుధవారం మట్టి అక్రమ తరలింపు యథేచ్ఛగా కొనసాగింది. ఇప్పటివరకు రాత్రి వేళల్లో కొనసాగించిన మట్టి రవాణాపై సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు పట్టపగలే రెచ్చిపోయారు. దీంతో రైతులకు మట్టి తోలకందార్లకు వాగ్వివాదం చోటుచేసుకుంది. మట్టి తోలకాలతో చెరువు గర్భం నాశనం అవుతుందని, భారీ గోతులు ఏర్పడి పశువులకు ప్రమాదకరంగా మారుతున్నాయని అక్రమార్కులతో ఘర్షణకు దిగారు. అంతేకాకుండా చెరువు నుంచి ఖరీఫ్ సీజన్లో పంట పొలాలకు సాగునీరు అందించే కాలువ గట్లు, కళింగ ప్రాంతం ధ్వంసమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తుదకు తాము అనుకున్న కాడికి మట్టి తోలకలు పూర్తి అయిన తర్వాత జేసీబీలను, టిప్పర్లను తరలించుకు వెళ్లారని తతంగమంతా గంటల తరబడి ఉన్నప్పటికీ అధికార గణం అటువైపు చూడలేదని రైతులు ఆరోపించారు.


