నకిలీ లెటర్లతో మోసం.. ఇద్దరి అరెస్టు
నూజివీడు : ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలో లోను క్లియర్ కాకుండానే క్లియర్ అయినట్లు నకిలీ పత్రాలను పెట్టి తనఖా పెట్టిన పత్రాలను రిలీజ్ చేయించడానికి ప్రయత్నించగా.. వారిని పోలీసులకు అప్పగించారు. శ్రీరామ్ ఫైనాన్స్ తాడేపల్లిగూడెం బ్రాంచ్‌లో అద్దేపల్లి వెంకటరత్నం కోటి రూపాయల లోను తీసుకున్నాడు. ఆ లోను క్లియర్ అయిపోయిందని చెప్పి బ్రాంచ్‌కి చెందిన వ్యక్తి అని చెబుతూ దొడ్డి నాగరాజు అనే అతనిని తీసుకొచ్చి నకిలీ సర్టిఫికెట్ సమర్పించి తనఖా రిజిస్ట్రేషన్ రిలీజ్‌కు ప్రయత్నించారు. ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ ఎన్.ఫణిసీతారామరాజుకు అనుమానమొచ్చి శ్రీరామ్ ఫైనాన్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి ఫేక్ లెటర్లుగా తెలిపారు. దీంతో వారిని పోలీసులకు అప్పగించారు.
ద్వారకాతిరుమల: రైతులకు తీవ్ర నష్టం కలిగించే అమెరికాతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మండలంలోని ఎం.నాగులపల్లిలో శుక్రవారం పాడి, మొక్కజొన్న రైతులు నిరసన వ్యక్తం చేశారు. మోదీ, ట్రంప్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుందని, ఇది అమలైతే అమెరికా నుంచి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, పండ్లు, కూరగాయలు తదితర పంటలు, పాలు, పాల పదార్థాలు ఎలాంటి దిగుమతి సుంకాలు లేకుండా పెద్ద ఎత్తున మన దేశంలోకి దిగుమతి అవుతాయని వివరించారు. దీంతో మన పంటలు అమ్ముకునే దారి లేక రైతులు దివాలా తీస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికాలో వ్యవసాయ రంగానికి 50 శాతం సబ్సిడీ ఇస్తుంటే, ఇక్కడి ప్రభుత్వం 3 శాతం మాత్రమే ఇస్తోందని అన్నారు. రైతు సంఘం మండల కార్యదర్శి గుర్రం రాంబాబు, పాల రైతులు, మొక్కజొన్న రైతులు గారపాటి సత్యనారాయణ, మద్దిపాటి వెంకటేశ్వరరావు, భీమడోలు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు.


