ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం

Feb 12 2026 7:02 AM | Updated on Feb 12 2026 7:02 AM

ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం

ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం

ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం

త్వరలో ఇంటర్‌, 10వ తరగతి పరీక్షలు

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌తో పాటు అన్ని తరగతులకు పరీక్షలు దగ్గర పడ్డాయి. ఏడాదంతా చదివింది ఒక ఎత్తు అయితే ఈ రెండు మూడు నెలలు చదివేది మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఈ సమయంలో కేవలం చదువు ఒక్కటే కాదు. ఈ సమయంలో ఆరోగ్యమూ ముఖ్యమే అని వైద్యులు, సైకాలజిస్టులు చెబుతున్నారు.

ఒత్తిడి.. పెను ప్రభావమే

పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులపై సహజంగానే ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలా ఒత్తిడి చేయడం విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులపై పెను ప్రభావమే చూపుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో వినోదం, క్రీడలకు దూరమై విద్యార్థులు మానసికంగా అధిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. వారికి కొంత ఆటవిడుపు సమయం ఇవ్వాలని, సూచిస్తున్నారు.

ఆహారం, విశ్రాంతిపై ప్రత్యేక శద్ధ అవసరం

చదువు ధ్యాసలో పడి సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోకపోయినా ప్రమాదమే అని, అటువంటి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కొందరు పిల్లలను రాత్రి 11 గంటల వరకూ చదివించి, తిరిగి తెల్లవారుజామునే 5 గంటలకు నిద్రలేపి మళ్లీ చదివిస్తుంటారని అలా చేయడం వల్ల విద్యార్థికి తగిన విశ్రాంతి దొరకక తొందరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో తేలికగా జీర్ణం అయ్యే ఇడ్లీ, చారుతో భోజనం మంచిందంటున్నారు. అలాగే అందుబాటులో ఉండే సీజనల్‌ పండ్లు, మెదడు చురుకుగా పని చేయడానికి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. పరీక్షలు పూర్తయ్యే వరకూ మాంసాహారాలకు, మసాలాలు, ఉప్పు, కారాలు అధికంగా ఉండే ఆహారాలు పెట్టకపోవడమే మంచిది. రాత్రి సమయాల్లో నిద్రకు ఉపక్రమించే ముందు టీలు, కాఫీలు తీసుకోకూడదు. రాత్రి పొద్దుపోయే వరకూ చదవకూడదు. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. తెల్లవారుజామున చదివితే పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయి.

పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్‌)

చదువుతో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే..

పరీక్షల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి

ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ అవసరం

తల్లిదండ్రులూ ఒత్తిడి పెట్టొద్దు

త్వరలో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు

జిల్లాలో 58 వేల మందికి పైగా విద్యార్థులు

త్వరలోనే ఇంటర్మీడియెట్‌, 10వ తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రాంభం కానున్నాయి. ఇంటర్మీడియెట్‌కు సంబంధించిన ప్రయోగ పరీక్షలు ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ప్రీ ఫైనల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి గ్రాండ్‌ టెస్ట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు, మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వారి పరీక్షలు ముగిసిన అనంతరం డిగ్రీ, పీజీ, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు జరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement