ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం ద్వారా 2015–16 నుంచి 2018–19 మధ్య కేంద్ర ప్రభుత్వం వారి ద్వారా ఎన్‌ఎఫ్‌డీసీ/ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ పథకాల ద్వారా రుణం పొందిన వారు రుణం చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందని ఈడీ ఎం.ముక్కంటి తెలిపారు. గురువారం రుణాలు చెల్లించిన వారికి తన కార్యాలయంలో వడ్డీ మాఫీ సర్టిఫికెట్లను అందించి, సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణాలు చెల్లించాల్సిన వారు 465 మంది ఉన్నారని, వారు. అసలు రూ.13.55 కోట్లు చెల్లిస్తే వడ్డీ రూ.1.66 కోట్లు మాఫీ అవుతుందని స్పష్టం చేశారు.
నూజివీడు: పట్టణంలోని కొత్తపేట 17వ వార్డులో అనధికారికంగా వంటగ్యాస్ సిలిండర్లను విక్రయించే దుకాణంపై గురువారం నూజివీడు సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మెరుపు దాడి చేశారు. అయితే సబ్‌కలెక్టర్ వెళ్లేసరికి దుకాణదారుడు దుకాణాన్ని మూసేసి వెళ్లిపోయాడు. దీంతో సబ్‌కలెక్టర్ ఇక్కడ ఏ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని చుట్టుపక్కల వారిని అడిగి దుకాణాన్ని సీజ్ చేయించారు. అలాగే దుకాణం షట్టర్‌పై నోటీసు అంటించారు. ఈ సందర్భంగా సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, పట్టణ పరిధిలో ఎక్కడైనా వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్‌కలెక్టర్ వెంట టీపీఓ కె.వెంకటేశ్వరరావు, మున్సిపల్ మేనేజర్ నరసింహారావు తదితరులు ఉన్నారు.


