దేవదేవా ‘అశ్వాలు’ లేవా? | - | Sakshi
Sakshi News home page

దేవదేవా ‘అశ్వాలు’ లేవా?

Apr 3 2026 7:02 AM | Updated on Apr 3 2026 7:02 AM

దేవదేవా ‘అశ్వాలు’ లేవా?

రథంలో ఎన్నో లోపాలు

అశ్వాలు లేని రథంలో చిన వెంకన్నకు రథోత్సవం

అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోని వైనం

ద్వారకాతిరుమల: ఆ దేవదేవుడి దివ్య రథానికి అశ్వాలు లేవు. అయినా ప్రతి ఆరు నెలలకోసారి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఈ రథంలోనే క్షేత్ర పురవీదుల్లో విహరించడం గమనార్హం. రథానికి చెక్క అశ్వాలు, ఛత్రం వంటివి లేవని అధికారులకు తెలిసినా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో తో భక్తులు ఇదేం దారుణమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం శ్రీవారి వార్షిక ఆదాయం రూ. 180 కోట్లు పైమాటే. ఇంత ఆదాయం వస్తున్నా.. కనీసం శ్రీవారి రథాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అధికారులు లేరు. అలాగే స్వామివారి చక్ర స్నానానికి కోనేరు నిర్మించే విషయంలోనూ అధికారులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

క్యాబిన్‌లోనే చక్ర స్నానం?

బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శ్రీవారికి రథోత్సవాన్ని, ఏడో రోజు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. అయితే అశ్వాలు లేని రథంలో రథోత్సవం, ఆలయ యాగశాలలో ట్యాప్‌ కింద చక్రస్నానం జరుపుతున్న తీరుపై గతేడాది అక్టోబర్‌ 11న సాక్షి దినపత్రికలో ‘ఆదాయమున్నా.. కనిపించని వైభవం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దానికి స్పందించిన ఆలయ అధికారులు యాగశాలలో ట్యాప్‌ వద్ద ఐరన్‌ క్యాబిన్‌ను నిర్మించారు. ఇకపై బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి చక్ర స్నానాన్ని అందులోనే జరపనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే శ్రీవారి చక్రస్నానం ఇక భక్తులకు పూర్తిగా కనబడనట్టే అవుతుంది.

దగ్గరపడుతున్న సమయం

శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మే 3 వరకు జరగనున్నాయి. అందులో భాగంగా రథోత్సవం మే 1న జరగనుంది. అంటే రథోత్సవానికి ఇంకా 28 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. అధికారులు స్పందిస్తే ఆ సమయంలోపే రథానికి అశ్వాలను ఏర్పాటు చేయించొచ్చు. అలాగే భక్తులకు అమ్మవార్ల దర్శనం కలిగేలా రథంలో కొద్దిపాటి మార్పులు చేయించొచ్చు. అయితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.

ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయలతో శ్రీవారి రథాన్ని నిర్మించారు. అయితే రథ నిర్మాణంలో తలెత్తిన లోపాలు కారణంగా రథం జీవకళను కోల్పోయిందన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా రథానికి చెక్క అశ్వాలు, ఛత్రం (పైన గొడుగు), రథం చుట్టూ సింహం బొమ్మలు ఉండాలి. అలాగే అశ్వాలను అదుపు చేస్తున్నట్టుగా రజకుడి బొమ్మ ఉండాలి. కానీ అవేమీ రథంలో లేకపోవడంతో భక్తులు విస్మయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే రథంలో స్వామివారి పక్కన ఉండే అమ్మవార్లు భక్తులకు కనిపించరు. దాంతో రథయాత్రలో పాల్గొనే భక్తులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. స్వామివారి ప్రస్తుత రథాన్ని పూర్వ రథాలకు మాదిరిగా చేయించాలని భక్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement