యలమంచిలి: ప్రారంభం కాని అంగన్‌వాడీ భవనానికి ఓ అధికారి గురువారం ప్రారంభోత్సవ శిలాఫలకం ఏర్పాటు చేయించాడు. ఇదెక్కడి చోద్యమంటూ ప్రశ్నించిన గ్రామస్తుడికి ఆ అధికారి నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వివరాల ప్రకారం మండలంలోని ఏనువానిలంకలోని శెట్టిబలిజపేటలో నాడు–నేడు పథకం ఫేజ్–1లో భాగంగా అంగన్‌వాడీ భవన నిర్మాణానికి వైఎస్సార్ సీపీ హయాంలో రూ.16 లక్షలు మంజూరయ్యాయి. అయితే ఆ నిధులతో భవనాన్ని నిర్మించినా, రంగులు వేయకపోవడంతో అసంపూర్తిగా ఉండిపోయింది. అయితే ఈ గ్రామ సర్పంచ్ జనసేన పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసిపోతుండంతో ఈ భవనాన్ని మార్చి 31న మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించినట్లుగా శిలాఫలకం తీసుకువచ్చి అతికారు.
ఆపుతావా..ఆపు..నీ వల్ల అవుతుందా?
ఈ విషయం తెలిసి వైఎస్సార్ సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లుల కొండలరావు భవనం వద్దకు వెళ్లి అక్కడ పని చేయిస్తున్న సమగ్ర శిక్ష ఏఈ వర్థనపు వెంకటేశ్వరరావు (కాసు)ను ప్రశ్నించారు. దీనికి ఏఈ స్పందిస్తూ శిలాఫలకం వేయడం ఆపుతావా? ఆపు..నీ వల్ల అవుతుందా? మంత్రి చెప్పారు..నేను చేస్తున్నా..అని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అయితే నాడు–నేడు పథకంలో పనులు జరిగితే శిలాఫలకంపై మన బడి–మన భవిష్యత్‌లో నిర్మించినట్లు వేయడం, యలమంచిలి ఎంపీపీ వినుకొండ ధనలక్ష్మి పేరు పక్కన పాలకొల్లు ఎంపీపీ అని వేయడంపై వైఎస్సార్ సీపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు.


