బలుసులమ్మ తల్లికి జాతర కళ
● పుష్కరం తరువాత జాతర మహోత్సవం
● మార్చి 12 నుంచి 27 వరకు జాతర ఉత్సవాలు
● మార్చి 22న ఆడపడుచుల సందడి, నైవేద్యాలు
● తాడేపల్లిగూడెంలో జాతరకు మొదలైన ఏర్పాట్లు
తాడేపల్లిగూడెం: కోరిక కోర్కేలు తీర్చే తల్లి.. కల్పవల్లి.. గూడేం పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ తల్లికి జాతర కళ వచ్చింది. పుష్కరం తరువాత జాతర నిర్వహిస్తుండడంతో అంగరంగ వైభవంగా అమ్మవారికి జాతర మహోత్సవం జరిపించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుట్టిల్లు పాశం వారి ఇంటి వద్ద నుంచి అత్తిల్లు కర్రి వారి ఇంటికి చేరే ప్రక్రియల మధ్య జాతరకు శ్రీకారం చుడతారు. అమ్మవార్ల ప్రతిరూపాలుగా భావించే గణాచారులకు గుగ్గిలపు ధూపాలతో జాతర వేడుక అంబరాన్ని తాకేలా సాగనుంది.
శతాబ్ధాలుగా
బలుసులమ్మ తల్లి పట్టణంలో శతాబ్ధాల క్రితం వెలిసినట్టు చెబుతారు. మునిసిపల్ కార్యాలయానికి సమీపంలో అనంతమ్మ చెర్వు వద్ద చిన్న గుడిగా ఉన్న ప్రాంతంలో అమ్మవారు కొలువయ్యారు. పాతూరుకు చెందిన కర్రి నర్సయ్య జమీందారు సారథ్యంలో ఆలయ నిర్వహణ సాగేదని ప్రతీతి. ఆ తర్వాత విశ్వాసం కలిగిన రజక కుటుంబాలు, ఆలయ అభివృద్దికి రావూరి పాండురంగారావు లాంటి దాతల ఆర్థిక చేయూతతో అమ్మవారి పూజాధికాలు సాగాయి. పట్టణంలో వివాహానికి ముందు పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె బలుసులమ్మ తల్లికి చలిమారు పోయాలి. చలిమిడి, వడపప్పు ప్రసాదంగా ఇవ్వాలి. పానకం పోయాలి. ఇలా చేస్తే వధూవరులు జీవితాంతం చల్లగా ఉంటారని విశ్వాసం.
పాలకుల చొరవతో మరింత శోభ
దేవదాయ ధర్మాదాయశాఖా మంత్రిగా పనిచేసిన దివంగత పైడికొండల మాణిక్యాలరావు, మాజీ డిప్యూటీ సీఎం, దేవదాయశాఖా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ, 12 ఏళ్ల క్రితం అప్పటి మునిసిపల్ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసుల పర్యవేక్షణలో అమ్మవారి ఆలయం దినదిన ప్రవర్థమానం చెందుతోంది. పైడికొండల ఆధ్వర్యంలో ఆలయ పునర్నిర్మాణానికి రూ.కోటి నిధులు, అమ్మవారి కల్యాణ మండపం నిర్మాణానికి అదనంగా నిధులు తీసుకొచ్చారు. ఈ నిధులతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారాయి. భీమవరం మావుళ్లమ్మ దేవతామూర్తికి రూపమిచ్చిన శిల్పి ఆధ్వర్యంలో బలుసులమ్మ రూపం మావుళ్లమ్మ, పెద్దింట్లమ్మ, రూపాలకు ప్రతిరూపం మాదిరిగా బలుసులమ్మ దేవతామూర్తి సాక్షాత్కరించింది. కొట్టు సారథ్యంలో అమ్మవారికి వెండి మకరతోరణం, వెండి ఊయల వంటి ఆభరణాలు అమరాయి. కల్యాణ మండపం పనిని పూర్తి చేశారు. ఆలయ ఆవరణలో మౌలిక వసతులు కల్పించారు. బొలిశెట్టి చైర్మన్‌గా ఉన్న సమయంలో తొలిసారి 2014లో జాతరకు శ్రీకారం చుట్టారు. సంయుక్త సహకారంతో అంగరంగ వైభవంగా ఈ జాతర అప్పట్లో జరిగింది. అయోధ్యలో రాముని ప్రతిమను చెక్కిన మైసూర్‌కు చెందిన అరుణ్‌యోగిరాజ్ బలుసులమ్మ ఆలయంలో ప్రాణప్రతిష్ట చేసి, యంత్రస్ధాపన చేసిన దేవతామూర్తికి రూపం ఇచ్చారు.
ఉత్సవ కమిటీల ఆధ్వర్యంలో..
బలుసులమ్మ ఉత్సవ కమిటీ చైర్మన్‌గా శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో 2014 జూన్ 18 నుంచి 24వ తేదీ వరకు తొలి జాతర జరిగింది. ఉత్సవ కమిటీ చైర్మన్‌గా కొట్టు అంజిబాబు సారథ్యంలో అమ్మవారి ఆలయానికి రజత వైభవం వచ్చింది. వసతులు ఒనగూరాయి. 12 ఏళ్ల తర్వాత శ్రీరంగం అంజి ఆధ్వర్యంలో మలి జాతర మార్చి 12 నుంచి జరుగనుంది.
మార్చి 12 నుంచి జాతర
మార్చి 12 నుంచి 27వ తేదీ వరకు జాతర మహోత్సవం నిర్వహించనున్నారు. మార్చి 22న ఆడపడుచులను గౌరవించడం, బంధువులను పిలుచుకొని నైవేద్యాలు పెట్టడం లాంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 27న మహాకుంభ నివేదన జరుగనుంది. ఇప్పటికే జాతర ఏర్పాట్లు మొదలయ్యాయి.


