తీరంలో తాబేళ్ల మృత్యుఘోష | - | Sakshi
Sakshi News home page

తీరంలో తాబేళ్ల మృత్యుఘోష

Feb 12 2026 11:31 AM | Updated on Feb 12 2026 11:31 AM

తీరంల

తీరంలో తాబేళ్ల మృత్యుఘోష

వలల్లో చిక్కుతున్న తాబేళ్లు

నరసాపురం, పేరుపాలెం బీచ్‌ల్లో విషాద దృశ్యాలు

సుమారు 50 తాబేళ్ల మృత్యువాత

నరసాపురం రూరల్‌: నరసాపురం నియోజకవర్గ తీర ప్రాంతంలో ఏటా వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఆలివ్‌ రెడ్లీ తాబేళ్లు, వేటగాళ్ల నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. గతేడాది కూడా ఇదే సమయంలో తాబేళ్లు మృత్యువాత పడిగా కలెక్టర్‌ చొరవతో తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షించి పిల్లలు బయటకు వచ్చాకా సముద్రంలో విడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేరుపాలెం, పెదమైనవానిలంక, చినమైనవానిలంక వంటి తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది జనవరి నుంచే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు రావడం ప్రారంభించాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో వీటి గుడ్లను సేకరించి హ్యాచరీల ద్వారా సంరక్షించే పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, సముద్రంలో జరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ సంఖ్యలో తాబేళ్లు మృతి చెంది తీరానికి కొట్టుకొస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా ఇదే సమయంలో సుమారు 100కు పైగా తాబేళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా మంగళవారం 29, బుధవారం 20 తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. వీటితోపాటు రెండున్నర మీటర్ల పొడవు, 240 కిలోల బరువు ఉన్న హేంపర్‌ బ్యాక్‌ డాల్ఫిన్‌ కూడా తీరానికి కొట్టుకు వచ్చింది. కేవలం తూర్పుతీరానికి దగ్గరలో నదీముఖ తీర ప్రాంతాల్లో 30 మీటర్ల కంటే తక్కువ లోతులో ఇవి సంచరిస్తుంటాయి. ప్రమాదపుటంచున ఉన్న ఈ తరహా డాల్పిన్‌లు ప్రస్తుతం పరిరక్షించాల్సిన జాతిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాబేళ్ల కళేబరాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, మరణానికి కారణాలు విశ్లేషించారు.

దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న సందర్శకులు

చనిపోయిన తాబేళ్ల కళేబరాలు తీరం వెంబడి కుళ్లిపోతుండటంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల బీచ్‌కు వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్ర తాబేళ్లకు సంబంధించి పోస్టుమార్టంలో అధిక శాతం వాటి పాదాలు నరికివేసి ఉండటం, కళ్లు పీకేసి ఉండటంతో పాటు, బలమైన దెబ్బతగిలిన గాయలతో పాటు వలల్లో చిక్కుకున్న అవశేషాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించిట్లు అఽధికారులు చెబుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి డీఏ కిరణ్‌, ఫారెస్ట్‌ రేంజర్‌ మురాల కరుణాకర్‌ పర్యవేక్షణలో మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ఏయస్‌ఆర్‌ మూర్తి, మత్స్యశాఖ అభివృద్ది అధికారి ఏడుకొండలు, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ రాంప్రసాద్‌, మైరెన్‌ ఏఎస్సై ఫాతిమా పాల్గొన్నారు.

మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహిస్తున్న దృశ్యం

సముద్ర జీవుల సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మత్స్యకారులు తీరం నుంచి 8 నాటికల్‌ మైళ్ల అవతల మాత్రమే వేట సాగించాలి. చాలా మంది ఈ నిబంధనను అతిక్రమించి తీరానికి దగ్గరగా వేటాడుతున్నారు. సంతానోత్పత్తి కోసం తీరానికి వచ్చే క్రమంలో, ఈ తాబేళ్లు మత్స్యకారుల వలల్లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందుతున్నాయి. తాజాగా తాబేళ్లతో పాటు డాల్ఫిన్‌ వంటి అరుదైన జీవులు కూడా మృతి చెందడం కలిచివేస్తోంది.

తీరంలో తాబేళ్ల మృత్యుఘోష 1
1/2

తీరంలో తాబేళ్ల మృత్యుఘోష

తీరంలో తాబేళ్ల మృత్యుఘోష 2
2/2

తీరంలో తాబేళ్ల మృత్యుఘోష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement