ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం

Feb 12 2026 7:02 AM | Updated on Feb 12 2026 7:02 AM

ముద్ద

ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం

ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం నమో నారసింహ.. తల్లీపిల్లల అప్పగింత కంపోస్టు యార్డులో మృతదేహం చికిత్స పొందుతూ మహిళ మృతి

తణుకు అర్బన్‌: తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో టీడీపీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వారు. గత వైఎస్సార్‌సీపీ హయాంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్‌లో 2024లో రోడ్డు శంకుస్థాపన కోసం ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తున్న కార్మికులను వైఎస్సార్‌ సీపీ నాయకులు ప్రశ్నించగా తణుకు నుంచి పనికి వచ్చామని గ్రామ మాజీ సర్పంచ్‌ ముళ్లపూడి శ్రీనివాస్‌ పని పురమాయించినట్లు చెప్పారు. అప్పట్లో రూ.5 కోట్లు నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారని, నేడు అర్ధాంతరంగా రాత్రి సమయంలో ఆ శిలాఫలకాన్ని తొలగించే పనులు చేపట్టారని వైఎస్సార్‌ సీపీ నాయకులు తుమ్మగంటి నాగ సత్యనారాయణ (నాగు) విమర్శించారు. ఇదేమిటని మళ్లపూడి శ్రీనివాస్‌ను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా ఇంటి లోపలకు వెళ్లిపోయారని నాగు తెలిపారు.

ద్వారకాతిరుమల: ఐఎస్‌ జగన్నాథపురంలో సుందరగిరిపై స్వయంభూ కనకవల్లీ సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ద్వితీయ దివస మోదక హవన ప్రారంభ వేడుకలు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయ యాగశాలలో మహా గణపతి లక్షమోదక హోమాన్ని జరిపారు. మహాశివరాత్రి నాడు జరిపే అతిరుద్రప్రయోగ సహిత సుదర్శన నృశింహ మహాయజ్ఞం నిర్వహణలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం ఆలయ యాగశాలలో నారసింహుని ఉపాసకులు కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్‌ కుటుంబరావు పర్యవేక్షణలో పలు కార్యక్రమాలను వైభవంగా జరిపారు. రుత్వికులు, పండితులు మోదకాలను, పలురకాల దినుసులను హోమగుండంలో వేస్తూ క్రతువును నిర్వహించారు. లోక శాంతి కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ముదినేపల్లి రూరల్‌: ఇటీవల అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీ తెలుసుకుని స్ధానిక పోలీసులు కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు. బొమ్మినంపాడుకు చెందిన వాసుపల్లి పెద్దిరాజులుకు భార్య శిరీషతోపాటు రాజేశ్వరి, శాంతిప్రియ, నాగదుర్గ కుమార్తెలున్నారు. వీరంతా ఈనెల 8న ఆధార్‌కార్డు సవరణలు చేసుకునేందుకు బయటకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పెద్దిరాజులు పోలీస్‌స్టేషన్‌ ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పెద్దిరాజులు భార్య శిరీష, కుమార్తెలు కలిదిండి మండలం కోరుకొల్లులో ఉన్నట్లు గుర్తించి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువచ్చారు. ఎస్సై వీరభద్రరావు వీరిని కుటుంబసభ్యులకు అప్పగించారు.

తణుకు అర్బన్‌: గుర్తు తెలియని మృతదేహం తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కంపోస్టు యార్డులో బుధవారం లభ్యమైంది. కంపోస్టు యార్డులోని చెత్తకు నిప్పుపెట్టిన స్థలంలో మృతదేహం కొంతభాగం కాలిపోయి ఉంది. మృతుడి వయస్సు సుమారుగా 40 నుంచి 50 మధ్య ఉండవచ్చని, తెలుపురంగు చొక్కా, నీలం రంగు జీన్స్‌ ఫ్యాంటు ధరించి ఉన్నారని, జుట్టు కొంతమేర తెలుపు రంగుతో ఉందని, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్‌ పోలీసులు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పంచనామా అనంతరం అంత్యక్రియలు జరిపించారు. రూరల్‌ స్టేషన్‌ ఏఎస్సై అనుమానాదస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మండవల్లి: ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం లింగాల గ్రామానికి చెందిన సాయిలక్ష్మి ఈ నెల 10వ తేదీన ఇంట్లో దేవుడికి దీపారాధన చేస్తుండగా, దీపం వత్తు ఆమె చీరకు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సమాచారం తెలుసుకున్న భర్త వెంకటేశ్వరరావు వెంటనే వచ్చి ఆమెను కై కలూరు ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్య సేవల నిమితం గన్నవరం సిద్ధార్ధ మెడికల్‌ కాలేజీకి తరలించారు. బుధవారం ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు సాయిల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం 1
1/1

ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement