ఫలితాన్ని మార్చే చేతిరాత
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన వాటికి సరైన మాధానాలు రాయడం ఒక్కటే మార్కులు సంపాదించడానికి ఉపయోగపడుతుందనుకుంటే పొరపాటే. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారికి విద్యార్థులు రాసిన జవాబులు పూర్తిగా అర్థమైతేనే వారు ఆశించిన మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
పరీక్షల సమయం దగ్గరకు వచ్చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల చదువు ఎలా సాగుతోంది అనే అంశంపైనే శ్రద్ధ చూపుతున్నారు. చదువుతో పాటు దస్తూరీ పైనా దృష్టి సారిస్తే చక్కటి మార్కులు సొంతమంటున్నారు నిపుణులు. అక్షర దోషాలు, గజిబిజి చేతిరాత వల్ల ఒకటి, రెండు మార్కులు కోల్పోయే ప్రమాదముందంటున్నారు. విద్యార్థి కోల్పోయే ఆ ఒకటి, రెండు మార్కులే ర్యాంకును వేలల్లో తగ్గించేస్తుందనే విషయాన్ని గుర్తెరిగి దస్తూరీపై కూడా శ్రద్ధ చూపాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాధాన పత్రాన్ని దిద్దే ఉపాధ్యాయుడికి మంచి దస్తూరి కనిపిస్తే ఆ ప్రభావం ఆయన వేసే మార్కులపై సానుకూలంగా ఉంటుందని, ఈ క్రమంలో చక్కటి దస్తూరితో పరీక్షలు రాస్తే మంచి మార్కులు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జవాబు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పత్రాలను మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు మంచి మార్కులు వేసే అవకాశముంటుందంటున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే లోపు ప్రతి రోజూ కొద్ది సేపు రాతపై కూడా శ్రద్ధ పెట్టి సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చంటున్నారు.
విద్యార్థులు చేసే పొరపాట్లు
కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25–30 లైన్లు రాస్తారు. గజిబిజిగా ఉంటే జవాబు పత్రం చూడగానే ఆకట్టుకోదు. ఒక్కోపేజీలో 16–18 లైన్లకు మించకూడదు. లైన్లు సమాంతరంగా ఉండాలి. చాలా మంది విద్యార్థులు ఒత్తిపట్టి రాస్తుంటారు. పెన్నును వేళ్లతో బిగుతుగా పట్టుకుంటారు. దీంతో పేజీ రెండో వైపు అక్షరాలు కనిపిస్తూ చివరికి జవాబుపత్రం గజిబిజిగా తయారవుతుంది.
హ్యాండ్ రైటింగ్‌పై దృష్టి పెట్టాలంటున్న అధ్యాపకులు


