బుట్టాయగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు అన్నారు. మండల కేంద్రమైన బుట్టాయగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతికి సంబంధించి మొదటి విడతలో 50 వేల ఎకరాలు తీసుకుని పనులు చేయకుండా బాహుబలి సెట్టింగ్‌లు చేసి రాష్ట్ర ప్రజలకు సినిమా చూపించారని అన్నారు. మళ్లీ రెండో విడతలో 80 వేల ఎకరాలు భూములు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి భూములు ఇచ్చే విషయంలో రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. లక్ష ఎకరాలతో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు దోపిడీకి తెరలేపారన్నారు. అమరావతి పేరుతో రూ.40 వేల కోట్లు అప్పు చేసి రూ.5 వేల కోట్లను అడ్వాన్స్‌గా తన అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. ఒక చోటే కేంద్రీకృతం ఉండకూడదని అభివృద్ధి రాష్ట్ర నలుమూలల ఉండాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారని చెప్పారు. అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నడూ మాట్లాడలేదని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన ప్రతిపాదనను తీసుకువచ్చారన్నారు. ఆ ప్రతిపాదనలను కూడా చంద్రబాబు తీసుకునే పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపాదించిన మావిగన్‌ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, ఎంపీపీ తెల్లం రమణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్‌రావు, తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): రాష్ట్రంలో ఐటీ రంగాభివృద్ధికి మరింత ఊతమిస్తూ, నైబర్‌హుడ్ వర్క్ స్పేసెస్ అనే వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టినట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో ఉమ్మడి, వృత్తిపరంగా నిర్వహించే కార్యాలయ మౌలిక వసతులు అందిస్తారన్నారు. హై–స్పీడ్ ఇంటర్నెట్, ప్రత్యేక డెస్క్‌లు, సమావేశ గదులు వంటి సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఈ కేంద్రాలలో నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు, డిజిటల్ వనరులు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు కూడా అందిస్తారన్నారు. దీంతో రిమోట్ వర్కర్లు, ఫ్రీలాన్సర్లు, స్టార్టప్‌లు, చిన్న సంస్థలకు మరింత మద్దతు లభించి, సహకారం, నెట్‌వర్కింగ్, నైపుణ్యాభివృద్ధికి అవకాశాలు విస్తరించనున్నాయని చెప్పారు. ఈ విధానం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సమ్మిళిత ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, ఐటీ రంగ విస్తరణకు దోహదపడుతుందని కలెక్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోరసం జిల్లా ఐటీ మేనేజర్ 7207702737 నెంబరులో సంప్రదించాలన్నారు.
ఏలూరు (టూటౌన్): పోలవరాన్ని సందర్శించి తన జీవితం ధన్యమైందని గవర్నర్ చెప్పడం సంతోషకరమైన విషయమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి తెలిపారు. ఆ ప్రాంత గిరిజనుల, ప్రజల అవసరాలు, సమస్యలు గురించి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ ఆ ప్రాజెక్టుకు భూములిచ్చిన గిరిజనులు, దళితులు, పేదలైన నిర్వాసితులపై లేకపోవడం శోచనీయమన్నారు. నిర్వాసితుల పునరావాసం గురించి ఆలోచన లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,05,000 వరకు ఉన్నాయని, వాటిలో దాదాపుగా 50 శాతంగా ఉన్న 50వేల కుటుంబాలకు చెందిన గిరిజనులు గోడు పట్టించుకొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలో పునరావాసం కేవలం 20 శాతం కూడా కల్పించలేదని, ప్రాజెక్టు నిర్మాణం మాత్రం 70 శాతం చేసారని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండలాన్ని యూనిట్‌గా తీసుకొని ఒకేసారి పరిహారం చెల్లించాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని కాగ్, సీపీఎం, ఇతర సంస్థలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. నిర్వాసితుల పరిస్థితి ముంపు వాటిల్లినప్పుడు చాలా దయనీయంగా ఉంటుందని, ఆధార్ కార్డులు చూసి కొవ్వొత్తులు, మంచినీటి ప్యాకెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఈ ప్రాంతంలో గర్నవర్ పర్యటించి నిర్వాసితులను కలవాలని, వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు.


