రైతు గోడు ఎవరికీ పట్టదా? | - | Sakshi
Sakshi News home page

రైతు గోడు ఎవరికీ పట్టదా?

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

ఎకరానికి రూ.45 వేల ఖర్చు

కొనుగోలు కేంద్రాలకు ఏర్పాట్లు

ఇంకా ప్రారంభం కాని

ధాన్యం కొనుగోలు కేంద్రాలు

ధాన్యం ఆరబెట్టేందుకు రైతుల అవస్థలు

భీమడోలు: రబీ ధాన్యం రోడ్డెక్కింది. చేతికందిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. దీనితో రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దళారులకు ధాన్యాన్ని అయినకాడకు అమ్ముకుంటూ నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం రైతులకు కనీస మద్దతు ధర దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు కొరత, వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మెషీన్లతో కోసిన పంట తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు.

దళారులను ఆశ్రయిస్తున్న రైతులు

వారం రోజుల కితమే ధాన్యం చేతికందినప్పటికీ.. కొనేవాడు లేక బరకాలు కప్పి ఉంచి కాపలా కాస్తున్నారు. రబీ ధాన్యం చేతికందగానే కొనుగోలుకేంద్రాలు తెరవకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. మెట్ట ప్రాంతాల్లోని బోర్ల కింద సాగు చేసిన 1153 రకం పంట కోతలు ప్రారంభం కాగా మాసూళ్ల పర్వం కూడా పూర్తయ్యింది. అయితే అటూ ప్రభుత్వం కొనక.. దళారులకే అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. దీనితో రైతులు, కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఓ పక్క వాతావరణంలో ఏర్పడ్డ ఎల్‌నినో పరిస్థితులు నేపథ్యంలో విభిన్న పరిస్థితులు తలెత్తడంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి కోతలు ప్రారంభించినా.. జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి సార్వాలో రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైగా నష్టాన్ని చవిచూసారు. అయితే దాళ్వాలో ఆ నష్టం నుంచి బయట పడాలంటే ఎకరాకు 50 బస్తాలకుపైగా దిగుబడులు రావాలి. కానీ కొన్ని చోట్ల 40 బస్తాలు మాత్రమే దిగుబడులు రావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 1153 రకం వేసిన రైతాంగం తక్కువ దిగుబడులు వస్తుండడంతో దాళ్వా నష్టాల సాగుగా మారింది.

ధాన్యం ఆరబోసుకునేందుకు ఇబ్బందులు

దాళ్వాలో రైతులు 1121, పీఆర్‌ 126, 1153, 1426 వరి రకాలను సాగు చేసారు. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద రైతులు 1153 రకాన్ని సాగు చేయగా.. 110 రోజుల పంట కావడంతో మార్చి నెలాఖరు నాటికి రైతుల చేతికందింది. అయితే ఆ ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. జాతీయ రహదారులు, అప్రోచ్‌ రోడ్లపై సీతంపేట, సూరప్పగూడెం తదితర గ్రామాల్లోని రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం లేక రైతులు వాటి పై బరకాలు కప్పి భద్రపర్చుకుంటుంన్నారు. ఎకరా సాగుకు రైతుకు రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ఖర్చు అయ్యింది. మెషీషన్లతో కోసిన ధాన్యాన్ని అరబెట్టేందుకు ఎకరాకు ఇద్దరు కూలీలకు రోజుకు రూ.800లు ఖర్చు అవుతుంది. ఎక్కువగా ఎండలో ఉండడంతో గింజ ముక్కలై నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు వేడుకుంటున్నారు.

10 ఏకరాల భూమిని ౖౖకౌలుకు తీసుకుని సాగు చేసాను, ఏకరాకు రూ.45వేల వరకు ఖర్చు అయ్యింది. ధాన్యాన్ని కోసి అరపోసి బస్తాలపై నింపాం. ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మిల్లుకు తరిస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచిన తర్వాత రేటు తెలుస్తుంది. అయితే రోడ్లపై ధాన్యం ఉంచితే పోలీసులు ఊరుకోవడం లేదు.

–ఎం.బాలయ్య, కౌలు రైతు, సీతంపేట

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 6, 7వ తేదీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు చర్యలు చేపట్టాం. భీమడోలు సబ్‌ డివిజన్‌ పరిధిలో భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ద్వారకాతిరుమల మండలాల్లో 55 వేల ఏకరాల్లో దాళ్వా సాగు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా కొన్నా దళారులపై తగు చర్యలు తీసుకుంటాం. –పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమడోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement