అధ్వానంగా కాలువల నిర్వహణ | - | Sakshi
Sakshi News home page

అధ్వానంగా కాలువల నిర్వహణ

Apr 4 2026 9:01 AM | Updated on Apr 4 2026 9:01 AM

పెనుగొండ: పంట కాలువలు, డ్రెయిన్లు నిర్లక్ష్యపు నీడలో వాటి సర్వూపాన్ని కొల్పోతున్నాయి. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో శివారు ప్రాంత రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రధాన కాలువ గట్లు డంపింగ్‌ యార్డులుగా, అక్రమణలతో నిండిపోతుండడంతో దిగువ ప్రాంతానికి నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాలువల నిర్వహణ గాలికొదిలేయడంతో రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సాగు తుది దశకు చేరుకొన్న తరుణంలో ఇప్పటికే వంతుల వారీ విధానంతో సాగును రైతులు ముందుకు నెట్టుకెళ్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఆక్రమణల పరంపర, నిర్వహణా లోపంతో దిగువకు నీరు ప్రవహించే అవకాశం లేదని రైతులు వివరిస్తున్నారు. ముఖ్యంగా దేవ కాలువ, ఇలపర్రు కాలువ, చానల్‌ 1, చానల్‌ 2 వంటి ప్రధాన కాలువల్లో వ్యర్థాలు ఎక్కువగా పడేయడంతో పాటు, తూడు పెరిగిపోవడంతో నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దేవ కాలువ పరీవాహక ప్రాంతాలు సైతం ఆక్రమణకు గురి కావడంతో రోజురోజుకు కాలువ బక్కచిక్కిపోతోంది. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటకాలువల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆక్రమణలు తొలగించడంతో పాటు, శివారు ప్రాంతాలకు నీరు సక్రమం చేరడానికి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

డ్రెయిన్ల పరిస్థితి దారుణం

మురుగు డ్రెయిన్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది, డ్రెయిన్ల గట్టులను పరీవాహక పంచాయతీలు డంపింగ్‌ యార్డులుగా వినియోగించుకుంటున్నాయి. రోజురోజుకూ చెత్త పెరిగిపోతుండడంతో ఆయా మురుగు డ్రెయిన్లలోకి చెత్త డంపింగ్‌ చేసేస్తున్నారు. నక్కలు డ్రెయిన్‌, తాడేరు డ్రెయిన్లు డంపింగ్‌ యార్డులుగా ఉపయోగపడుతున్నాయి. దీంతో వర్షాకాలంలో నీరు ముందుకు సాగే పరిస్థితి లేక పరీవాహక ప్రాంతమంతా ముంపునకు గురై వందలాది ఎకరాల పంటను నష్టపోవాల్సి వస్తుంది. రైతులు పదేపదే అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుంది. డంపింగ్‌ యార్డులకు స్థలాలు కేటాయించకపోవడం వల్లే కాలువ గట్లను పంచాయతీలు డంపింగ్‌ యార్డులుగా ఉపయోగిస్తున్నాయని చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement