ఆక్వా రైతుల సమస్యలు పరిష్కరించాలి
పాలకొల్లు సెంట్రల్ : ఆక్వా రైతులు కష్టాలు ప్రభుత్వానికి తెలియడం లేదా అని జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు ప్రశ్నించారు. ఓ పక్క ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతుంటే.. ఫీడ్ కంపెనీలు తమ స్వార్ధంగా వ్యవహరిస్తూ ఫీడ్ ధరలు పెంచడం బాధాకరమైన విషయమని అన్నారు. ఫీడ్ ధరలు పెంచుతున్నా మత్స్య శాఖ మంత్రి, అప్సడా సభ్యులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమైన విషయమన్నారు. ఫీడ్ కంపెనీలు పెంచిన ధరలకు వ్యతిరేకంగా జిల్లా స్థాయిలో ఉన్న అన్ని ఆక్వా సంఘాల నేతలతో కలిసి సమావేశం ఏర్పాటు చేసి కొన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆక్వా రైతు సంఘ నాయకులు అందరూ కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. వినతిపత్రాలు సమర్పించిన అనంతరం ఫీడ్ కంపెనీలు, ప్రాసెస్ యూనిట్‌లు, ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూసి అనంతరం జిల్లా వ్యాప్తంగా మళ్లీ ఆక్వా రైతులతో సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఆ తదుపరి మిగతా జిల్లాల సంఘాలతోనూ చర్చించి అందరితో ఏ చర్యలు తీసుకోవాలో, ఎలా ముందుకు వెళ్లాలో కార్యాచరణ చేస్తామన్నారు.


