శాస్త్రవేత్తల సూచనలు పాటించాలి
జంగారెడ్డిగూడెం: శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తూ నాణ్యమైన పొగాకును ఉత్పత్తి చేయాలని పొగాకు బోర్డు ఆర్‌ఎం జీఎల్‌కే ప్రసాద్ అన్నారు. మండలంలోని తాడువాయి, చల్లావారిగూడెం, మంగిశెట్టిగూడెం, బుట్టాయగూడెం, మార్కండేయపురం, సూరపువారిగూడెంలో వ్యవసాయక్షేత్రాలను ఆయన శాస్త్రవేత్తలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం మాట్లాడుతూ నాణ్యమైన పొగాకు ఉత్పత్తికి, మంచి దిగుబడికి రైతులు సకాలంలో తొలి మొగ్గ దశలో తల తుంచి పిలక నివారణ మందు వాడాలన్నారు. మందులు వాడిన 17 రోజుల తర్వాత మాత్రమే ఆకు కొట్టు చేయాలని, లేదంటే పురుగు మందు అవశేషాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. మెగ్నీషియం లోపం ఎక్కువగా ఇసుక నేలల్లో ఉంటుందని, ఎకరాకు 15 కిలోల మెగ్నీషియం ఆకై ్సడ్ శాస్త్రవేత్తలు సూచించిన విధంగా భూమిలో వేయాలన్నారు. ఇనుము లోపం గుర్తిస్తే 0.5శాతం ఫెర్రస్ సల్ఫేట్ లీటరు నీటికి 5 గ్రాములు పిచికారీ చేయాలన్నారు. సూక్ష్మ పోషకాల సమగ్ర యాజమాన్యంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ వెంకటేశన్, వేలం అధికారులు జె.సురేంద్రకుమార్, బి.శ్రీహరి, గ్రేడింగ్ అధికారి వై.ప్రశాంత్, ఐటీసీ లీఫ్ మేనేజర్ కొట్రేష్ తదితరులు పాల్గొన్నారు.


