శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి ఉపాలయమై, క్షేత్రపాలకునిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురువారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసే వేడుక కన్నులపండువగా జరిగింది. ముందుగా ఆలయ ముఖ మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవ మూర్తులను ఉంచి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చకులు, పండితులు శైవ ఆగమోక్తంగా వేడుకను ప్రారంభించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ శివయ్యను పెండ్లి కుమారునిగా, గంగా, పార్వతీ అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేశారు. ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ ఐ.రమణరాజు, సూపరింటిండెంట్ కేవీ దుర్గాప్రసాద్ దంపతులు స్వామి వారికి పూజాధికాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయంలో అంకురార్పణ, ధ్వజారోహణ తదితర కార్యక్రమలు జరుగుతాయని ఆలయ ఈఓ తెలిపారు.


