పోక్సో కేసులో నిందితుల అరెస్టు
నరసాపురం రూరల్: సోషల్ మీడియాలో పరిచయమైన బాలికలను నమ్మించి, వారిపై అత్యాచార యత్నానికి పాల్పడిన ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. నరసాపురంలో సీఐ దుర్గాప్రసాద్ వివరాలు వెల్లడించారు. యలమంచిలి మండలానికి చెందిన ఇద్దరు బాలికలపై గత నెల 22న మొగల్తూరులోని లాడ్జిలో అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితుల్లో ఒకరైన పెదమైనవానిలంక గ్రామానికి చెందిన తిరుమాని దుర్గాప్రసాద్‌కు బాధితుల్లో ఒక బాలికతో ఏడాదికాలంగా ఇనన్‌స్ట్రాగామ్‌లో పరిచయం ఉంది. సదరు యువకుడు బాలికను నరసాపురం రమ్మని కోరాడు. దీంతో ఆ బాలిక మరో స్నేహితురాలిని కూడా తీసుకుని నరసాపురం వెళ్లగా.. నిందితుడు స్నేహితుడు తిరుమాని రాజేంద్రతో కలిసి వారిని మొగల్తూరులోని జీఎన్‌ఆర్ కాంప్లెక్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను శనివారం అదుపులోకి తీసుకున్నారు. సమావేశంలో మొగల్తూరు ఎస్సైలు జి.వాసు, వై.నాగలక్ష్మి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఉండి: ప్రభుత్వోద్యోగులను ప్రభుత్వమే పట్టించుకోకపోతే ఎవరితో చెప్పుకోవాలని వీఆర్‌ఏలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఉండి తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌ఏల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, గౌరవాధ్యక్షుడు ఎం.ఆంజనేయులు, డిప్యూటీ తహసీల్దారు సూర్యనారాయణరాజుకు ఈ నెల 12న సీఐటియు ఆధ్వర్యంలో నిర్వహించే దేశవ్యాప్త సమ్మైపె వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చిరుద్యోగులైన వీఆర్‌ఏలు కనీస వేతనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వీఆర్‌ఏల సమస్యలపై వినతిపత్రాలు ఇచ్చినా కనీస స్పందన లేకపోవడం బాధాకరమని అన్నారు.
భీమవరం: ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ విధానాన్ని ప్రవేశపెడుతున్నామని సంస్థ సీఎండి పృథ్వీతేజ్ ఇమ్మడి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించనున్న ఈ కార్యక్రమాన్ని ఈ నెల 9 నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. 8688400499 నెంబరులో విద్యుత్ సమస్యలను తెలియజేయవచ్చని వెల్లడించారు. విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని తెలిపారు.
ఆగిరిపల్లి: ఆగిరిపల్లి కి చెందిన బెజవాడ రామారావు (65) ట్రాక్టర్ బోల్తా పడి మృతి చెందాడు. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం ఆగిరిపల్లికి చెందిన రామారావు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం మల్లిబోయినపల్లి వద్ద పొలంలో ఉన్న గేదెల కోసం ఆగిరిపల్లి నుంచి ట్రాక్టర్ ఎక్కగా బస్టాండ్ వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టడంతో ట్రాక్టర్ బోల్తా పడింది. కింద పడిపోయిన రామారావుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రామారావుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని బొలెరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.


