పెనుగొండ ఎంపీడీఓపై విచారణ
పెనుగొండ: పెనుగొండ ఎంపీడీఓ టి.సూర్యనారా యణ మూర్తిపై వచ్చిన ఆరోపణలపై నరసాపురం డీఎల్‌డీఓ జి.రాణి గురువారం విచారణ చేపట్టారు. 15వ ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, అభివృద్ధి పనులు, కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు తీసుకున్నారంటూ పెనుగొండకు చెందిన కాకి ప్రభాకర్ పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఎంపీటీసీలకు నిధుల కేటాయింపులో వివక్ష చూపారని, నిధులను సరిగా ఖర్చు చేయలేదని ఆరోపించారు. అలాగే కాంట్రాక్టర్ల నుంచి నేరుగా యాప్‌లలో కమీషన్లు తీసుకున్నారని, గ్రామ కార్యదర్శుల నుంచి సైతం వసూళ్ల పర్వం ఉందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో జెడ్పీ సీఈఓ పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలంటూ డీఎల్‌డీఓను ఆదేశించారు. మండలంలోని గ్రా మ కార్యదర్శులు, కాంట్రాక్టర్లు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బందిని ఆమె విచారించారు. ఓచర్లు, ఎంబుక్‌లు, తీర్మానాలు పరిశీలించారు.
వివాదాస్పదంగా తీరు
ఎంపీడీఓ తీరు వివాదాస్పదంగా ఉంది. ప్రొటోకాల్ పాటించడంలోనూ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తుందని ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఇటీవల వెంకట్రామపురంలో నిర్వహించిన శంకుస్థాప న కార్యక్రమాల్లో సర్పంచ్‌ను కించపరిచేలా వ్యవహరించారన్న విమర్శలు వున్నాయి. దీనికి తోడు వడలిలో శంకుస్థాపనలు, అభివృద్ధి పనుల వివరాలు తెలియకుండానే నిర్వహిస్తున్నారని అధికార పక్షం నుంచే ఆరోపణలు రావడంతో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు వాయిదా వేశారు. వడలి గ్రా మంలో ఎంపీటీసీలకు సమాచారమే ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు.
భేదాభిప్రాయాలతోనే..
స్థానిక ఎమ్మెల్యే, ఎంపీపీల మధ్య వ్యతిరేక పార్టీల వలన వచ్చిన భేదాభిప్రాయాలు ఎంపీడీఓకి కలిసి వచ్చాయని ఎంపీటీసీలు అంటున్నారు. దీంతో నిధులను విచ్చలవిడిగా వెచ్చిస్తున్నారని ఆరోపించారు. విచారణలో ఎంపీటీసీలకు అవకాశం కల్పించకపోవడం దురదృష్టకరమని, మరింత లోతుగా విచారణ నిర్వహించాలని పలువురు డిమాండ్ చేశారు. విచారణ అనంతరం నివేదికను సీఈఓకు సమర్పిస్తామని, నివేదిక ఆధారంగా తుది నిర్ణయం ఉంటుందని డీఎల్‌డీఓ రాణి తెలిపారు.


