ఆరోగ్యశ్రీ వైద్యానికి డబ్బులా!?
తణుకు అర్బన్ : ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వైద్య సేవల్లో తమ నుంచి డబ్బు దండుకున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి గ్రామానికి చెందిన దొడ్డిపట్ల మల్లిఖార్జున గంగా ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి బొప్పే విజయలక్ష్మి ఈనెల 9న పడిపోయి కాలు విరగడంతో తణుకులోని ఆపిల్ ఆస్పత్రికి అదే రోజు సాయంత్రం 5 గంటలకు తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వగా రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం లోపలకు తీసుకెళ్లిన సిబ్బంది స్ట్రెచర్‌పైనే ఉంచి ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేశారు. ఇందుకు రూ.1,200, రక్త పరీక్షలకు రూ. 4,540తో పాటు మరో రూ.1,000 కట్టించుకున్నారు. ఆరోగ్యశ్రీలోనే కదా.. డబ్బులు ఎందుకని ప్రశ్నిస్తే ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చేవరకు మీరు ఖర్చులు పెట్టుకోవాలని బదులిచ్చారు. దీంతో బాధితులు చెల్లించారు. కాసేపటికి రూంకి పంపిస్తామని చెప్పిన ఆస్పత్రి సిబ్బంది.. రూ.15 వేలు చెల్లించాలన్నారు. తాము చెల్లించలేమని బాధితులు చెప్పగా.. రూ.10 వేలు చెల్లించమన్నారు. దీంతో వెళ్లిపోతామని బాధితులు చెప్పి తణుకు సాయిశ్వేత ఆస్పత్రిలో చేరారు. అక్కడ అన్ని పరీక్షలు, శస్త్రచికిత్స ఉచితంగానే చేశారు. ఆపిల్ ఆస్పత్రి తీరుపై 104 నంబరుకు ఫిర్యాదుచేస్తే విజయలక్ష్మి పేరు సాయిశ్వేత ఆస్పత్రిలో మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యిందని, ఆపిల్‌లో కాలేదన్నారు. ఆపిల్ ఆస్పత్రి సిబ్బంది రిజిస్ట్రేషన్‌ను పెండింగ్‌లో పెట్టి అందినకాడికి దోచేయాలని చూశారని బాధితుడు గంగా ప్రసాద్ తెలిపారు. ఇలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్య తన దృష్టికి రాలేదని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ కీర్తి ‘సాక్షి’కి చెప్పారు.
ఆపిల్ ఆస్పత్రి రసీదులు, ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ చూపిస్తున్న బాధితుడు గంగా ప్రసాద్
ఆపిల్ ఆస్పత్రిలో విజయలక్ష్మి పేరుతో ఆరోగ్యశ్రీలో రిజిస్ట్రేషన్ చేసిన పత్రం
కాలు విరగడంతో తణుకులోని ఆపిల్ ఆస్పత్రికి బాధితురాలు
పరీక్షలంటూ స్ట్రెచర్ పైనే రూ.6,740 వసూలు
రూం చార్జీలకు రూ.15 వేలు చెల్లించాలంటూ డిమాండ్
ఆరోగ్యశ్రీ వైద్యానికి డబ్బులా!?


